Reading Time: 3 minutes

రాజకీయాల్లో నాయకత్వాన్ని కొలిచే ప్రమాణాలు అనేకం ఉంటాయి. అధికారాన్ని సాధించడం ఒకటి, ప్రజలకు సంక్షేమం అందించడం మరొకటి. అయితే వాటన్నింటికంటే గొప్పది నాయకుడు తనపై నమ్మకం ఉంచిన వారిని ఎలా ఆదుకుంటాడన్నది. నమ్మి నడిచిన వారికోసం ఎంతదూరమైన వెళ్లి నిలబడగలిగితేనే నాయకత్వం సార్థకం అవుతుంది. రాజకీయ సమీకరణాలు, వర్గాల ఒత్తిళ్లు, అవకాశాల కోసం జరిగే పోటీ మధ్య అలాంటి ధోరణి అరుదుగా కనిపిస్తుంది. అందుకే రాజకీయాల్లో నమ్మకం అనేది అత్యంత విలువైన మూలధనంగా చెప్పబడుతుంది. అధికార పోరాటాల్లో చాలాసార్లు వ్యక్తిగత విశ్వాసాల కంటే రాజకీయ సమీకరణలే పైచేయి సాధిస్తాయి. పరిస్థితులు మారితే మిత్రులు మారడం, సమీకరణాలు మారితే నిర్ణయాలు మారడం రాజకీయాల్లో సహజమే. కానీ కొందరు నాయకులు మాత్రం ఈ సాధారణ ధోరణికి భిన్నంగా వ్యవహరిస్తారు. తమపై విశ్వాసం ఉంచిన వారిని కాపాడటమే కాకుండా అవసరమైతే వారి కోసం రాజకీయంగా రిస్క్ తీసుకోవడానికీ వెనుకాడరు. అలాంటి నాయకత్వాన్ని రాజకీయ చరిత్ర ప్రత్యేకంగా గుర్తుంచుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అలాంటి నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఆయన రాజకీయ జీవితం గురించి మాట్లాడేటప్పుడు సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాప్రయోజనాల నిర్ణయాలు ఎంతగా చర్చకు వస్తాయో, తనతోపాటు నడిచిన నాయకులపై చూపిన విశ్వాసం కూడా అంతే ప్రాధాన్యం పొందుతుంది. వైఎస్సార్‌కు వ్యక్తిగత నమ్మకం చాలా విలువైనది. తనతోపాటు పోరాటంలో నడిచిన వారిని ఆయన ఎప్పుడూ మరువలేదు. ఆ సందర్భాల్లో ఎక్కువగా ప్రస్తావించబడేది కెవిపి రామచంద్రరావుతో ఆయనకు ఉన్న అనుబంధం. కెవిపిని ఆయన కేవలం రాజకీయ సహచరుడిగా మాత్రమే కాకుండా అత్యంత సన్నిహితుడిగా భావించేవారని కాంగ్రెస్ వర్గాలు చెప్పేవి. ఆయనపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా రాజ్యసభ సీటు వ్యవహారం తరచూ ఉదాహరణగా చెప్పబడుతుంది. పార్టీ అంతర్గతంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, తనకు నమ్మకంగా ఉన్న వ్యక్తికి న్యాయం చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ వ్యవహరించిన తీరు అప్పట్లో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇదే ఆయన నాయకత్వానికి ప్రత్యేకతను తెచ్చింది. ఇప్పటి తెలంగాణ రాజకీయాల్లో కూడా ఇటువంటి దృశ్యం కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిలో కూడా ఇదే లక్షణం ప్రతిఫలిస్తోందని వారు చెబుతున్నారు.

ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో ఆయన ప్రదర్శించిన పట్టుదల దీనికి ఉదాహరణగా చెప్పబడుతోంది. సాధారణంగా రాజకీయాల్లో రాజ్యసభ స్థానాల విషయంలో అనేక సమీకరణాలు ప్రభావం చూపుతాయి. ప్రాంతీయ సమతుల్యత, సామాజిక వర్గాల ప్రతినిధిత్వం, పార్టీ అంతర్గత ఒత్తిళ్లు వంటి అంశాలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈసమీకరణల మధ్య కూడా తనకు నమ్మకంగా ఉన్న వ్యక్తికి అవకాశం కల్పించాలనే సంకల్పంతో రేవంత్‌రెడ్డి నిలబడ్డారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. చివరకు వేం నరేందర్ రెడ్డి పేరు ఖరారవడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.ఇది కేవలం ఒక రాజకీయ నియామకం మాత్రమే కాదని, తనతోపాటు నడిచిన వారిపై రేవంత్‌రెడ్డి ఉంచిన విశ్వాసానికి ఇది ఒక సంకేతమని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. 2023లో తాను పిసిసి అధ్యక్షుడిగా, మహేశ్ కుమార్ గౌడ్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. అలాగే 2029లో మహేశ్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా, తాను ముఖ్యమంత్రిగా మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రత్యేకమైన రాజకీయ సంకేతంగా భావించబడుతున్నాయి. సాధారణంగా అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ అంతర్గతంగా నాయకత్వ పోటీలు పెరుగుతాయి. కానీ రేవంత్‌రెడ్డి మాత్రం పార్టీ నిర్మాణంలో తనతో కలిసి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతం ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా మహేశ్ కుమార్ గౌడ్ వంటి నాయకులను ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం పార్టీ అంతర్గత ఐక్యతకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన యాదృచ్ఛికం కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే ప్రక్రియలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, మహేశ్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా కలిసి పనిచేస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే అప్పటి పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాకు చెందినవారు కాగా, ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా అదే జిల్లాకు చెందినవారు కావడం గమనార్హం. అలాగే 1995 తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, 2014 తర్వాత 2023లో మళ్లీ అధికారంలోకి రావడం మరో ఆసక్తికరమైన యాదృచ్ఛికంగా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి -మహేశ్ కుమార్ గౌడ్ జోడీని కొందరు నాయకులు కృష్ణార్జునుల జంటగా అభివర్ణిస్తున్నారు. పార్టీపరంగా ఒకరు సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తే, మరొకరు పాలనా వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారని వారు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినతరువాత కూడా పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే చివరికి రాజకీయాల్లో నాయకులపై తుది తీర్పు ప్రజలదే. వారి నిర్ణయాలు ప్రజల జీవితాల్లో ఎంతమేరకు మార్పు తీసుకొస్తాయన్నదే ప్రధాన ప్రమాణం అవుతుంది. అయినప్పటికీ నమ్మినవారికి అండగా నిలబడే నాయకత్వం పార్టీకి దీర్ఘకాలిక బలం ఇస్తుందని రాజకీయ చరిత్ర చెబుతోంది. ఈ నేపథ్యంలో చూస్తే, నమ్మినవారికి న్యాయం చేయాలనే నాయకత్వ లక్షణం రాజకీయాల్లో ఎంత విలువైనదో మరోసారి గుర్తు చేస్తున్న పరిణామాలుగా ఇవి నిలుస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్సార్ నాయకత్వంలో కనిపించిన ఆ లక్షణం, ఇప్పుడు రేవంత్‌రెడ్డి రాజకీయ శైలిలో కనిపిస్తోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి రాజకీయాల్లో విజయానికి కేవలం అధికారమే ప్రమాణం కాదు. నమ్మకం, నిబద్ధత, సహచరులపట్ల బాధ్యత కూడా అంతే కీలకమైన అంశాలు. నమ్మి నడిచిన వారిని నిలబెట్టుకోవడం, కష్టకాలంలో వెంట నడిచిన వారిని మరువకపోవడం నాయకత్వానికి నిజమైన పరీక్ష. అలాంటి విలువలతో ముందుకు సాగే నాయకత్వమే ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్న పరిణామాలు కూడా అదే సందేశాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాయి. నమ్మకం నిలబడితేనే నాయకత్వం బలపడుతుంది. నాయకత్వం బలపడితేనే ప్రజల విశ్వాసం మరింత గట్టిపడుతుంది. ఇదే ప్రజా రాజకీయాల అసలు సారం. 

అమరవాజీ నాగరాజు

(టిపిసిసి ప్రెసిడెంట్ పిఆర్‌ఒ)