
ఒకప్పుడు ఆశావహ దృక్పథం కలిగిన భారత ప్రధాన మంత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ‘మాగా’ (MAGA: Make America Great Again) నినాదం, ‘మిగా’ (MIGA : Make India Great Again) లక్ష్యానికి దోహదపడుతుందని చెప్పారు. అయితే దాదాపు పావు శతాబ్దంగా కొనసాగుతున్న భారత్ -అమెరికా వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యం ఇప్పుడు ముగిసినట్లే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్‌లో అమెరికా ఉపవిదేశాంగ కార్యదర్శి క్రిస్టఫర్ లాండౌ దీనిని స్పష్టంగా చెప్పారు: చైనాకు ఇచ్చినట్టుగా ఆర్థిక ప్రయోజనాలను అమెరికా భారతదేశానికి ఇవ్వదు. భారత్ అమెరికాకు పోటీదారుగా మారేందుకు కూడా అవకాశం ఇవ్వదు. వాణిజ్య ఒప్పందం ‘అమెరికా ఫస్ట్’ అనే సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటుంది.
అమెరికా అధికార ప్రతినిధి నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలు, భవిష్యత్తులో భారత్ -అమెరికా సంబంధాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకప్పుడు పరస్పర సహకారంతో ముందుకు సాగుతున్న ఈ రెండు దేశాల భాగస్వామ్యం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది. గత దశాబ్దంగా భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను గమనిస్తున్న వారికి ఇది ఆశ్చర్యంగా అనిపించే విషయం కాదు. అటల్ బిహారి వాజపేయి -మన్మోహన్ సింగ్ కాలంలో ఏర్పడిన సానుకూల దిశ నుంచి ఈ సంబంధాలు 2017లో మలుపు తిప్పుకున్నాయి. అప్పుడే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య రంగంలో భారత్‌పై విమర్శలు మొదలుపెట్టారు. అమెరికా మార్కెట్లో కొన్ని భారతీయ ఎగుమతులకు ప్రత్యేక రాయితీలు కల్పించిన జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎస్‌పి) సదుపాయాన్ని ఉపసంహరించుకోవడం ఈ దిశలో మొదటి అడుగు. ట్రంప్ ప్రధాన లక్ష్యం చైనానే అయినప్పటికీ, ఆ నిర్ణయాల ప్రభావం భారత్‌పైనా పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఈ ‘లావాదేవీ ధోరణి (transactionalism)’ కి ప్రధాని నరేంద్ర మోడీ తన వ్యక్తిగత అనుబంధం, స్నేహపూర్వకంగా ప్రతిస్పందించేందుకు ప్రయత్నించారు. హ్యూస్టన్‌లో జరిగిన భారీ సభలో ట్రంప్‌తో చేతులు పట్టుకుని వేదికపైకి నడిచారు. అలాగే 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రోజు, మోడీ తన స్వరాష్ట్రం గుజరాత్‌లో నిర్వహించిన మరో భారీ సభలో అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ మద్దతు ప్రకటించారు. కానీ ఆ రాజకీయ పెట్టుబడి ఫలించలేదు. చివరకు ట్రంప్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.
అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ కూడా ఇదే లావాదేవీ ధోరణిని కొనసాగించారు. సంబంధాలు కొనసాగాలంటే భారత్ అమెరికా నుంచి మరిన్ని రక్షణ సామగ్రి కొనుగోలు చేయాలని ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. దీనిపై భౌగోళిక రాజకీయాలు, విదేశాంగ వ్యవహారాలను విశ్లేషించే పలువురు వ్యాఖ్యాతలు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ఇకపై ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ కంటే ‘లావాదేవీ ఆధారిత సంబంధాలు’గా మారిపోయాయని వారు పేర్కొన్నారు. అయితే ఈ భాగస్వామ్యంపై విశ్వాసం ఉంచినవారు మాత్రం వెనక్కి తగ్గలేదు. వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సాంకేతిక రంగంపైనే కేంద్రీకృతమైందని వారు చెప్పారు. ఇకపై అమెరికా భారత్‌కు ఉన్నతమైన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుందని వాదించారు. ఈ వాదనకు మద్దతుగా వివిధ ఒప్పందాలను ఉదాహరణగా చూపించారు. న్యూఢిల్లీలోని థింక్‌ట్యాంక్‌లు, మీడియా వర్గాల్లోని అనేక మంది కూడా ఈ ఆశాభావాన్నే కొనసాగించారు. భారత్- అమెరికా భాగస్వామ్యానికి ప్రారంభం నుంచే మద్దతు ఇచ్చిన అమెరికన్ విశ్లేషకుల్లో ఒకరైన ఆష్లీ టెలిస్ నుంచి మొదటి గట్టి హెచ్చరిక వచ్చింది. కార్నెగీ ఎండౌమెంట్‌కు చెందిన ఆయన 2024లో ఈ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత విశ్లేషణను ప్రచురించారు. ఆ విశ్లేషణలో టెలిస్ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేశారు. గతంలో భారతదేశం ఎదగడం, అమెరికా ప్రయోజనాలకు అనుకూలం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఆ అభిప్రాయానికి మద్దతు ఇచ్చేవారు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో ప్రభావం కలిగిన ప్రతి వర్గమూ ఇప్పుడు ఒకే ప్రశ్న దాంతో మాకు ఏమి లాభం? అని అడుగుతోందని టెలిస్ చెప్పారు.
2008 ప్రారంభంలో అమెరికా కాంగ్రెస్ సభ్యుల ప్రతినిధి బృందం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసిన సందర్భం నాకు గుర్తొస్తోంది. వారు అప్పుడు ఇలా అన్నారు: ఇది 123 కోసం 126. అంటే, భారత- అమెరికా పౌర అణు ఒప్పందానికి మార్గం సుగమం చేసే హైడ్ చట్టంలోని 123 సవరణకు తమ మద్దతు ఇవ్వడం వెనుక ఒక అర్థం ఉందని వారు సూచించారు. అదేంటంటే, భారత్ 126 యుద్ధ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలని వారు ఆశిస్తున్నారని అర్థం. కానీ ఆ కొనుగోలులో భారత్ చివరకు ఫ్రాన్స్‌ను ఎంచుకుంది. అయినప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు భారత్ తర్వాత అమెరికా నుంచి ఇతర రక్షణ సామగ్రి కొనుగోలుపై బిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది.
అధ్యక్షుడు ట్రంప్ కాలంలో పరిస్థితి మరింత స్పష్టమైంది – అమెరికా మాంగే మోర్! అనే ధోరణి కనిపించింది. భారత్ మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని, ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌కు ఉన్న అధిక మిగులు (ట్రేడ్ సర్‌ప్లస్) తగ్గించాలని అమెరికా కోరింది. అంతేకాదు, భారత్ తన దిగుమతి సుంకాలను తగ్గించాలనీ, డేటా లోకలైజేషన్ విధానంపై పట్టుదల విడిచిపెట్టాలనీ అమెరికా ఒత్తిడి తీసుకొచ్చింది. తరువాత రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని కూడా నిలిపివేయాలని కోరింది. సారాంశంగా ట్రంప్ సందేశం ప్రసిద్ధ సంగీత నాటకం మై ఫెయిరీ లేడీ (My Fair Lady) లోని పాటలా ఉండింది ప్రేమ గురించి మాట్లాడకండి, చేసి చూపించండి! ప్రపంచాన్ని ఎంత కావాలంటే అంత ఆలింగనం చేసుకోండి, కానీ నా ముందు మాత్రం వంగాలి – అన్నట్టుగా ఆ సందేశం కనిపించింది.
ట్రంప్ నుంచి ఒకదాని వెంట ఒకటి అనేక షాక్‌లు వచ్చాయి. మొదటగా 2025 జనవరిలో జరిగిన తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ట్రంప్ ఆహ్వానించి, భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం ఇవ్వకపోవడం గమనార్హం. ఈ పరిస్థితిలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెంటనే వాషింగ్టన్‌కు వెళ్లి ప్రధానమంత్రికి ఆహ్వానం పొందేందుకు ప్రయత్నించారు. కానీ చివరికి ఆయనకు మాత్రమే ఆహ్వానం లభించింది. దీని వెంటనే మరో వివాదం చెలరేగింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం, భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతలను తానే మధ్యవర్తిత్వం చేసి యుద్ధ విరమణకు దారితీసానని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అంతేకాదు, ఇందుకు తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని కూడా పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ ప్రకటనలను ఖండించింది. కాల్పుల విరమణ నిర్ణయంలో అమెరికాకు ఎలాంటి పాత్రలేదని స్పష్టం చేసింది. ఇక పాకిస్థాన్ మాత్రం ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఆ తరువాత భారతదేశంపై విమర్శలు చేస్తూ వచ్చిన పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌కు అమెరికా అధ్యక్షుడు మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం ఇవ్వడం మరో సంచలనంగా మారింది. ఇది దౌత్యపరంగా అసాధారణమైన పరిణామంగా భావించబడింది. ఢిల్లీ, వాషింగ్టన్‌లోని దౌత్యవర్గాలు మరో విషయాన్ని కూడా గమనించాయి. ప్రధాని నరేంద్ర మోడీ వైట్‌హౌస్‌కు వెళ్లినప్పుడు ట్రంప్ స్వయంగా ద్వారం వద్దకు వచ్చి స్వాగతం పలకలేదు. అదే సమయంలో ట్రంప్ పాకిస్థాన్ నాయకత్వంతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సన్నిహితంగా వ్యవహరించడాన్ని కూడా వారు గుర్తుచేశారు. పాకిస్థాన్ నాయకులు మాత్రం ఆయనతో ఎంతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ఎప్పటికప్పుడు సర్‌జీ అంటూ మర్యాద చూపుతున్న దృశ్యాలు కనిపించాయి.
భారతదేశంలో మోడీ అనుచరులను ఎక్కువగా ఆగ్రహానికి గురిచేసే విషయం ఏదైనా ఉంటే, అది భారత్ కంటే పాకిస్థాన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం. చైనా విషయంలో అయితే వారు కొంత వరకు సహనంగా ఉంటారు. ఎందుకంటే అక్కడ డబ్బే ప్రభావం చూపుతుందని వారికి తెలుసు. చైనా పెద్ద ఆర్థిక శక్తి, సంపన్న దేశం. కాబట్టి ప్రపంచ దేశాలు చైనాతో తమ సంబంధాలను కొనసాగిస్తే దానికి పెద్దగా అభ్యంతరం చెప్పలేమని వారు భావిస్తారు. కానీ పాకిస్థాన్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నం. వారి దృష్టిలో అది విఫలమవుతున్న, అస్థిరతలో ఉన్న దేశం. అంతేకాదు, భారత్‌కు ప్రత్యక్ష శత్రువు. అలాంటి దేశంతో ఎవరైనా స్నేహపూర్వకంగా వ్యవహరించడం ఎలా సమర్థించగలమని వారు ప్రశ్నిస్తారు. అయితే ట్రంప్ మాత్రం పాకిస్థాన్‌తో సన్నిహితంగా వ్యవహరించడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ అవమానాలు, నిర్లక్ష్య సంకేతాలు వరుసగా ఎదురైనా భారత్ మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్‌ను సందర్శించి అక్కడి ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పలుమార్లు సన్నిహితంగా కలుసుకున్నారు. అమెరికాలో ప్రభావం కలిగిన యూదు వర్గాలు ట్రంప్‌పై ప్రభావం చూపించి, మోడీపై ఆయన వైఖరిని మార్చవచ్చని భావించినట్టుగా కనిపించింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై బాంబు దాడులు చేసి, ఆ దేశ సుప్రీం నాయకుడిని హత్య చేసిన ఘటనపై కూడా భారత్ పెద్దగా స్పందించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా మరో చర్య భారత్‌కు అసౌకర్యం కలిగించింది. భారత జలాలకు సమీపంలో ఉన్న ఒక ఇరాన్ నౌకపై బాంబు దాడి చేసిన తర్వాత, గల్ఫ్ ప్రాంతంలో సరఫరాలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారత్‌కు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన భారత్‌పై మరింత అవమానకరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ అవమానాల పరంపర కొనసాగుతూనే ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు మరోసారి స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. ‘చైనా ఎదుగుదలకు అమెరికా సహకరించడం వల్ల మీకు సమస్యలు తలెత్తాయి. కానీ భారతదేశం ఎదుగుదల కోసం మేము ఆ సమస్యలను పరిష్కరించలేము అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే సందేశం స్పష్టమే.. అమెరికాను గొప్పగా చేయాలనే MAGA (Make America Great Again) లక్ష్యానికి, భారత్‌ను గొప్పగా చేయాలనే MIGA (Make India Great Again) అవసరం లేదన్న మాట.
సంజయ్ బారు