Reading Time: 3 minutes

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల భూదాన భూమిలో నిరాశ్రయులైన నిరుపేదల కోసం దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూ సేలా ఆదర్శవంతమైన మోడల్ కాలనీ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. భూదాన్ భూముల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్ళను కూల్చడంతో నిరాశ్రయిలైన నిరుపేదలకు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఇళ్ళ పట్టాలతో పాటు ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు పంపిణీ చేశారు. భూదాన్ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాకుండా వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గురువారం నుంచే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి డిసెంబర్ 9న సోనియాగాంధి జన్మదినోత్సవం నాటికి మోడల్ కాలనీని నిర్మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేస్తామని చెప్పారు .

ఇల్లు కట్టిస్తామని పది సంవత్సరాలపాటు పరిపాలించిన వారు చెప్పిన మాటలు నమ్మి ఎదురు చూసి చూసి పేదల కళ్ళు కాయలు కాశాయని, వారు ఒక్క ఇల్లు కూడా పంపిణీ చేయలేదని, అలాంటి వారికి మా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఈ రాష్ట్రంలో జీవించే ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలనేది సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఆలోచన అన్నారు. ఆ ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో పేదవారి కోసం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు రూ 22,500 కోట్ల నిధులను ఒకేసారి మంజూరు చేసి చేసే దేశ చరిత్రలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం తమది అనే డిప్యూటీ సీఎం తెలిపారు. ఇలాంటి ప్రభుత్వంపై కావాలని పేదలకు మేలు జరగవద్దనే ఉద్దేశ్యంతో కొద్దిమంది ప్రజా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా వెలుగుమట్లలో మాఫియా గ్యాంగ్ పేదల నుంచి డబ్బులు వసూలు చేసి ,వారికి కనీస సౌకర్యాలు లేకుండా సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసిందని, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేయాలని వెలుగుమట్లలో అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. వెలుగుమట్లలో అర్హత కలిగిన 412 మందిని గుర్తించి పట్టాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రభుత్వాన్ని ,మంత్రులను వ్యక్తిగతంగా దూషించారని,ఇతర రాజకీయపార్టీ వారనే కక్షపూరితంగా వ్యవహరించకుండా పారదర్శకంగా జరిగిన సర్వే అధారంగాఅర్హులైన అందరికి పట్టాలను ఇస్తామని,ఇంకా ఎవ్వరైన అర్హులు మిగిలిపేతే వారికి కూడా అందజేస్తామన్నారు.. వివిధ గ్రామాల్లో ఉన్న 101 మంది పేదలకు వారి గ్రామాల్లో ఉన్న స్థలాల్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి ఈ రోజే అనుమతి పత్రాలు మంజూరు చేశామని , ఇది పేదల పక్షాన మాకు ఉన్న నిబద్ధత అని భట్టి స్పష్టం చేశారు. పేదలనిసహాయతను,పేదరికాన్ని అడ్డుపెట్టుకొని బతికే మాఫియా శక్తులను దరిదాపుల్లోకి రానివ్వద్దని పేదలకు, అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. వెలుగుమట్లలో పేదలకు పంచగా మిగిలిన 16 ఎకరాల భూమిని తెలంగాణ పబ్లిక్ స్కూల్, గురుకుల పాఠశాలల వంటి ప్రభుత్వ విద్యా సంస్థల నిర్మాణానికి ఉపయోగిస్తామన్నారు.

‘యాడ మీ ప్రభుత్వం వచ్చేది’?: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పదే పదే తమ ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటూ బీఆర్‌ఎస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, యాడ మీ ప్రభుత్వం ఒచ్చేది? .. ఏంది మీ ప్రభుత్వం ఒచ్చేది? అని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ‘ఈ ప్రజాప్రభుత్వం పేదోడికి అండగా ఉంది. పేదోడి దీవెనలు ఉన్నాయి. ఫలితాలు ఉన్నాయి.. ఇన్ని ఫలితాలు చూశాక కూడా నిస్సిగ్గుగా పగటి కలలు కనవద్దు. ఇంకా ఊహించుకుంటున్నావ్.. ముఖ్యమంత్రిని అనో, కాబోయే ముఖ్యమంత్రిని అనో.. మీ పగటి కలలను కల్లలుగానే ఈ తెలంగాణా ప్రజలు ఉంచుతారు.. ఊహల్లో ఊగిసలాడకు’ అని పొంగులేటి కెటిఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గత నెల 24న వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేతలు జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే నాయకులు వచ్చి మొసలి కన్నీరు కార్చారని , 2023 జూలై నెలలో ఎన్నికల కంటే ముందు వెలుగుమట్ల ప్రాంతంలో కూల్చివేతలకు గత ప్రభుత్వం పాల్పడింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.

పేదల జీవితాల్లో శాశ్వత వెలుగులు: మంత్రి తుమ్మల

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఇళ్ళపేరుతో కొంతమంది ముఠా ఏర్పడి మోసం చేస్తే గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు పేరిట ఇచ్చిన పత్రాలు బోగస్ అని, సిసిఎల్‌ఏ ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. మాఫియాను ప్రారద్రొలే కమ్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలో పేదలకు కొంత ఇబ్బంది కలిగిందని.. దీని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలన్నారు ప్రజా ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల వెలుగుమట్ల లో పేదల జీవితాల్లో శాశ్వత వెలుగులను నింపామని,దీని ద్వారా పదేళ్ళుగా నడుస్తున్నసమాంతర ప్రభుత్వాన్ని ఉక్కుపాదంతో అణిచివేసినట్లయిందన్నారు.లాఠీ ఛార్జ్ లేకుండా అక్రమ నిర్మాణాలు కూల్చివేసి దగా కోరులను తరిమివేశామని మంత్రి తెలిపారు. పదేళ్ళు బిక్కుబిక్కుమంటూ బ్రతికారని ఇకపై స్వేఛ్చగా,నిర్బయంగా ,దర్జాగా ఆత్మగౌరవంతో బతకవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ,జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న,ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ పిన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు,ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ,కమీషనర్ అభిషేక్ అగస్థ్య తదితరులు పాల్గొన్నారు.