Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్) పార్టీ మారలేదని, ఆ పార్టీలోనే కొనసాగుతున్నారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు ఇచ్చారు. వారిరువురు పార్టీ ఫిరాయించినట్లు సరైన సాక్షాధారాలు లేనందున వారిపై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టి వేశారు. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ స్పీకర్ వద్ద పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు రెండేళ్ళ పాటు స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణ జరిపి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న అభియోగాలతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన సాక్షాధారాలు చూపించనందున అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.

కెసిఆర్ క్షమాపణ చెబితే

రాజీనామా చేస్తానన్న కడియం

బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు క్షమాపణ చెబితే తాను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు అనంతరం కడియ శ్రీహరి ఉద్వేగంగా మీడియాతో మాట్లాడుతూ కెసిఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించారని ఆయన ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన ఉదహరించారు. బిఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్ చట్టబద్దం కాదన్నారు. తాము బిఆర్‌ఎస్‌లోనే ఉన్నామని, అయితే పార్టీ నాయకత్వానికి దూరంగా ఉన్నామని ఆయన చెప్పారు. శాసనసభలో కూడా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. బిఆర్‌ఎస్ తనకు ఎప్పుడూ నోటీసు ఇవ్వలేదని, కెసిఆర్ కూడా ఎప్పుడూ తాను పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా చెప్పలేదని కడియం తెలిపారు.

బిజెపి ఎందుకు ఫిర్యాదు చేసిందిః దానం మండిపాటు

స్పీకర్ తీర్పు అనంతరం దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ తనపై స్పీకర్‌కు బిజెపి ఎందుకు ఫిర్యాదు చేసిందని ఆగ్రహంగా ప్రశ్నించారు. బిజెపికి ఏమి సంబంధం అన్నారు. తాను బిఆర్‌ఎస్ సభ్యత్వంతోనే ఉన్నానని, కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని తెలిపారు. గండిపేట రిసార్ట్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిర్వహించిన అవగాహన తరగతుల సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. మళ్లీ సిఎం కాలేకపోయానన్న బాధ కెసిఆర్‌కు లేకపోయినా కెటిఆరే ఇబ్బంది పడుతున్నారని దానం విమర్శించారు.

ప్రజల తీర్పును కాలరాయడమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం

కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతున్నదని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపుదారులకు స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును కాలరాయడమే అవుతుందని ఆయన విమర్శించారు. గతంలో బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాన్నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని ఆయన దుయ్యబట్టారు. బిఆర్‌ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో కండువా మార్చుకుని, ఏకంగా కాంగ్రెస్ బీ-ఫామ్‌తో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి తనపై పోటీ చేసిన సాక్ష్యాలు బహిరంగంగా కనిపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సాక్షాలు సరిపోవా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పీకర్‌ను ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం: బిజెపి చీఫ్ రాంచందర్ రావు ధ్వజం

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ధ్వజమెత్తారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొంది, ఆరు నెలల లోపే మరో పార్టీలో చేరి లోక్‌సభకు పోటీ చేయడం ప్రజలు చూశారని, ఇంత స్పష్టమైన సాక్షం ఉన్నప్పటికీ దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించలేమని చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

ప్రజాస్వామ్యం ఖూనీ..

కేంద్ర మంత్రి బండి ధ్వజం

కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. కన్న తల్లే బిడ్డను చంపడం ఎంత పాపమో…శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంతకంటే పాపం అని ఆయన విమర్శించారు. శాసన వ్యవస్థే ఫిరాయింపులను ప్రోత్సహించేలా స్పీకర్ తీర్పు ఉందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని కేంద్ర మంత్రి బండి డిమాండ్ చేశారు.