Reading Time: < 1 minute

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు (82) అనారోగ్యంతో బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను గురువారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహిం నున్నట్లు వారి కుటుంబసభ్యులు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కావూరి చురుగ్గా పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో ఆయన 5 సార్లు లోక్ సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. మచిలీ పట్నం, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించారు.యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పనిచేశారు.

రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కావూరి సాంబశివరావుకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విశాఖపట్నం ఎంపీ, నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు అయిన శ్రీ భరత్… కావూరి సాంబశివరావుకు స్వయానా మనవడు (కుమార్తె కుమారుడు). రాష్ట్ర విభజన సందర్భంలో ఆయన సమైక్యాంధ్రకు మద్దతిచ్చారు. కావూరి సాంబశివరావు వరంగల్‌లోని ఆర్‌ఇసిలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించారు. కావూరి మృతి పట్ల పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు.

ఎపి సిఎం చంద్రబాబు సంతాపం

‘సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరం. మచిలీపట్నం, ఏలూరు నియోజకవర్గాల నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచి, కేంద్రమంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు మరణం తీరనిలోటు. రాజకీయ, వ్యాపార రంగంలో కావూరిది ప్రత్యేక ముద్ర. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కావూరి సాంబశివరావు మృతి పట్ల ఎపి బిజెపి అధ్యక్షుడు మాదవ్ సంతాపం వ్యక్తం చేశారు.