Reading Time: < 1 minute

న్యూఢిల్లీ: చట్టసభ అంటే ఏదో ఒక పార్టీకి చెందినది కాదు. మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించేది అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. తనను అనేక సార్లు సభలో కీలక విషయాలపై మాట్లాడనివ్వలేదని, ఇది ఎంతవరకూ న్యాయం అని ప్రశ్నించారు. స్పీకర్ ఓం బిర్లా తొలిగింపు తీర్మానంపై చర్చలో ఆయన జోక్యం చేసుకుంటూ రాహుల్ మాట్లాడారు. సభ దేశానికి చెందినది. దేశానికి సంబంధించిన కీలక సమస్యలు, అంశాలపై మాట్లాడే అవకాశం, అధికారం అందరికీ ఉంటుంది. అడ్డుకోవడం కుదరదని తెలిపారు.

ప్రధాని మోడీ అన్ని విషయాలపై రాజీపడ్డారని, దీని ఫలితం ఏ విధంగాఉందనేది అందరికీ తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత సభలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పార్లమెంటరీ నియమావళిని నిబందనలను పట్టించుకోవల్సి ఉందని బిజెపి ఎంపి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. మంత్రి ప్రజాస్వామిక ప్రక్రియను గౌరవిస్తూ మాట్లాడాల్సి ఉంటుంది. పలు సార్లు సభలో అధికార పక్షం, మంత్రులు తన పేరు అనుచితంగా ప్రస్తావించారు. స్పీకర్ పాత్ర ఏమిటనేది సభ్యులందరికీ అవసరం అయిన విషయం. సభ ప్రజల స్పందనకు వ్యక్తీకరణకు వేదిక కావాల్సి ఉంటుంది. తాను ఎప్పుడు సభలో మాట్లాడాలనుకున్నా తనను అడ్డుకున్నారని , ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు.