
హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్ ప్రాంతాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్- ,అమెరికా-, ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పుడు సైబరాబాద్ పరిధిలోని హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్న హాస్టళ్లు, చిన్న, పెద్ద హోటళ్లు, మెస్ కేంద్రాలు ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. రోజూ వందలాది మందికి వంట చేయాల్సిన హాస్టల్ నిర్వాహకులు గ్యాస్ అందుబాటులో లేక వంట పనులను కొనసాగించడం కష్టంగా మారిందని చెబుతున్నారు. హాస్టళ్లలో నివసించే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు బయట నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ ఉదయం టిఫిన్ నుంచి రాత్రి భోజనం వరకు హాస్టళ్లలో లేదా సమీప హోటళ్లలోనే ఆహారం తీసుకుంటారు.
అయితే గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో చాలా హాస్టళ్లలో వంట పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. కొంతమంది నిర్వాహకులు తాత్కాలికంగా ఇండక్షన్ స్టౌలు లేదా చిన్న సిలిండర్లతో వంట చేయడానికి ప్రయత్నిస్తున్నా, పెద్ద సంఖ్యలో ఉన్న నివాసితులకు ఆహారం సిద్ధం చేయడం సాధ్యపడటం లేదని చెబుతున్నారు. దీంతో కొన్ని హాస్టళ్లు బయట హోటళ్ల నుంచి భోజనం తెప్పించి ఇస్తుండగా, మరికొన్ని తాత్కాలికంగా మెస్ సేవలను నిలిపివేశాయి. ఇక హోటళ్ల పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ లేకపోవడంతో అనేక చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. కొంతమంది హోటల్ యజమానులు వ్యాపార సమయాలను తగ్గించగా, మరికొన్ని హోటళ్లు పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా రాత్రి ఆలస్యంగా వరకు బయట ఫుడ్‌పైనే ఆధారపడుతుంటారు. రాత్రి రెండు గంటల వరకు కూడా తెరిచి ఉండే టిఫిన్ సెంటర్లు, హోటళ్లు ఈ ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తాయి. కానీ ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ఆహారం అందుబాటులో లేకపోవడం ఉద్యోగులకు పెద్ద సమస్యగా మారుతోంది. మేము రోజూ హాస్టల్ మెస్ లేదా సమీప హోటళ్లపైనే ఆధారపడుతుంటాం. ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల భోజనం దొరకడం కూడా కష్టంగా మారింది. ఇది ఇంకా కొనసాగితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక ఐటీ ఉద్యోగి తెలిపారు.
రోజూ వందల మందికి వంట చేయాలి. కమర్షియల్ గ్యాస్ లేకపోతే అది అసాధ్యం. చిన్న సిలిండర్లతో అంత పెద్ద స్థాయిలో వంట చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఒక హాస్టల్ నిర్వాహకుడు తెలిపారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఐటీ కారిడార్‌లో ఆహార సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. కరోనా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసేలా పరిస్థితులు మారుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత గ్యాస్ సరఫరా సంస్థలు తక్షణ చర్యలు తీసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని హాస్టల్ నిర్వాహకులు, హోటల్ యజమానులు, ఉద్యోగులు కోరుతున్నారు. లేదంటే నగరంలోని కీలక ఐటీ ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులు సమావేశం ఏర్పాటు చేసి హాస్టల్స్ నడపలెమని చేతులెత్తెశారు.కనీసం హాస్టల్స్ వరకు డొమెస్టిక్ వాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ వైపుకు కంపెనీల మొగ్గు : ప్రస్తుతం మళ్ళీ నగర జీవనంపై కరోనా లాంటి పరిస్థితులు దాపురించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్స్, హోటల్స్‌లలో గ్యాస్ లేక ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున సైబరాబాద్ పవరిధిలోని పలు కంపెనీలు తమ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఫుడ్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నగరంలో హోటల్స్ మూతతో కోట్లాది రూపాయల నష్టం ఏర్పడే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ రంగం పై ఆధారపడి బతికే కార్మికులకు గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి.