
ఇరాన్‌ను దెబ్బతీయడానికి ఏమిలేదు
నాయకుడు లేడు. నాయకత్వం దెబ్బతింది
ఆరువారాల లక్ష్యం.. రెండో వారంలోనే పూర్తి
హడావిడి ప్రెస్‌మీట్‌లో ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ : ప్రస్తుత మధ్యప్రాచ్య యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చునని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇరాన్ తో తమ యుద్ధం అనంతర పరిణామాల విశ్లేషణ క్రమంలో తమ ఆంతరంగిక సలహదారులతో ట్రంప్ సుదీర్ఘంగా చర్చించారు. తరువాత వైట్‌హౌస్‌లో కిక్కిరిసిన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. యుద్ధం ఆగిపోతుంది. అయితే ఇది తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆగిపోవచ్చు. ఇప్పుడు తమ ముందు ఇరాన్ సంబంధిత టార్గెట్స్ ఏమీ మిగిలిలేవు. అక్కడి అగ్రనాయకత్వం పోయింది. రెండో శ్రేణి కథ ముగిసింది. ఇక తాము కొట్టడానికి మిగిలిదేమీ లేదని ట్రంప్ స్పందించారు.
ఇరాన్ ఇక సరైన నాయకత్వంతో ముందుకు సాగుతుందని అనుకుంటానని తెలిపారు. ఇప్పటికే ఇరాన్ సైనిక బలగాలు బాగా దెబ్బతిన్నాయని, వారు కోలుకోలేని రీతిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇక యుద్ధం ముగుస్తుంది. త్వరలోనే ఆగిపోతుందని తెలిపారు. ఇజ్రాయెల్ బలగాలతో కలిసి అమెరికా సేనలు సాగించిన పోరులో ఇరాన్‌లోని పలు వ్యూహాత్మక స్థావరాలను దెబ్బతీశామని వివరించారు. ఇంకా కొన్ని మిగిలి ఉండవచ్చు. అయితే వారు పుంజుకోవడానికి మిగిలిందేమీ లేదన్నారు. తాను ఎప్పుడు ఆపివేయాలనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించారు. ఈ క్రమంలో ఈ యుద్ధం స్వల్పకాలికమే అన్నారు. అయితే యుద్ధం ముగిసిందనే ట్రంప్ వాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ రెవెల్యూషనరీ గార్డ్ దళాలు ఇప్పుడు అమెరికా కీలక స్థావరాలను, ప్రత్యేకించి టెక్ సాధనసంపత్తిని దెబ్బతీసే క్రమంలో ఉన్నాయని తెలిపారు.
తాము బలోపేతం అవుతున్న దశలోనే, అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేకత పెరుగున్నదని, దీనితోనే ఆయన ఇప్పుడు ఓ డ్రామాగా ఈ మాటలకు దిగారని ఇరాన్ స్పందించింది. ఇప్పటికి సాగిన వార్ గొప్పగా ఉందని, తాము నిర్ణీత లక్షాలను కాలపరిమితికి ముందే చేరుకున్నామని , అనుకున్న దానికంటే ముందే శత్రువును దెబ్బతీయడం జరిగింది. ఇది అమెరికాకు గ్రేట్ వార్, అంతకు మించి గ్రేట్ ఫన్ అన్నారు. నిర్ణీత అంచనాల ప్రకారం ఆరు నెలలు యుద్ధం ఉంటుందనుకున్నానని, అయితే ముందే ఆగిపోయేలా ఉందని తెలిపారు. ఇరాన్‌ది విచ్ఛిన్నకర విధానం అని విమర్శించారు. ఇతర ప్రాంతాలపై అల్లరిచిల్లరిగా దాడికి దిగడం ద్వారా దశాబ్దాల తరబడి కోలుకులేని నష్టం కల్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
చమురు ఎఫెక్ట్‌తోనే ట్రంప్ ప్రకటన?
ఓ వైపు గల్ఫ్‌దేశాలపై ఇరాన్ దాడులు తీవ్రతరం, దీనితో ఆయా దేశాల నుంచి అమెరికాపై ఒత్తిళ్లు, మరో వైపు హర్మూజ్ జలసంధి నౌకా మార్గంలో చమురు రవాణా నౌకలపై ఇరాన్ బలగాల దాడులు, చమురు సరఫరా వలయానికి విఘాతం, అన్నింటికీ మించి అమెరికా సైన్యం ఇప్పటి యుద్ధంపై మానసికంగా వ్యతిరేకత ప్రదర్శించడం వంటి కారణాలతోనే ట్రంప్ ఇప్పుడు యుద్ధం ఆగిపోతుందని ప్రకటించినట్లు విశ్లేషిస్తున్నారు. ఇక ఏ దశలో అయినా బ్యారెల్ చమురు ధర 200 డాలర్లకు చేరుకుంటుందని ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయ ఇంధన ఆధారిత మార్కెట్‌లో ప్రకంపనలకు దారితీసింది. మరో వైపు రష్యా అధ్యక్షులు పుతిన్ నేరుగా ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడటం, జరుగుతున్న పరిణామాల్లో అమెరికా నుంచి తక్షణ స్పందన అవసరం అని తెలియచేయడంతో ట్రంప్ తానే గెలిచినట్లు ప్రకటిస్తూ యుద్ధ విరమణకు దిగినట్లు స్పష్టం అవుతోంది.
మరో వైపు చైనా అత్యంత వ్యూహాత్మకంగా ఇరాన్‌కు బలోపేతమైన ఆయుధ వ్యవస్థను అందించడం, తాము వెంట ఉంటామని అంతర్గతంగా తెలియచేయడం వంటి పరిణామాలు కూడా అమెరికా వైఖరిలో కొట్టొచ్చేమార్పునకు దారితీసిన కారణాలు అని ప్రచారం జరుగుతోంది. వైమానిక దాడుల క్రమంలో ఇరాన్‌కు ఏ మేరకు నష్టం జరిగిందనేది బేరీజు వేసుకుని, ఈ క్రమంలో అమెరికా సైనిక పాటవ శక్తికి ఆర్థిక నష్టం ఏ మేరకు ఉందనేది లెక్కించుకుని ప్రస్తుత యుద్ధపర్వానికి ముగింపును , దీనికి ముందు సంబంధిత సంకేతాలను వెలువరించాలని ట్రంప్ భావించినట్లు , దీని వెనుక ఆయన సలహాదారుల బృందం కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది.
సుదీర్ఘ కాల యుద్ధమే ః ఇజ్రాయెల్
ఓ వైపు ట్రంప్ యుద్ధం ముగిసిందని చెపుతున్న దశలోనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జూ భిన్నంగా స్పందించారు. ఇది ఇప్పట్లో తేలేది కాదని, దీర్ఘకాలిక యుద్థానికే ఇజ్రాయెల్ సంసిద్ధం అయిందని ఇజ్రాయెల్‌లో ఓ గుర్తు తెలియని చోటు నుంచి మాట్లాడుతూ చెప్పారు. నిర్ణీత లక్షాలను చేరుకోవల్సి ఉంటుంది. నిర్ణయాత్మక విజయం దక్కేవరకూ పోరు నిలిపేది లేదని , ఇందుకు ఇజ్రాయెల్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత తీవ్రస్థాయి పోరు బుధవారంతో రెండో వారంలోకి చేరుకుంది.