Reading Time: < 1 minute

ఖమ్మం: పేదలకు మేలు జరగకుండా విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాల పట్టాల అందజేత కార్యక్రమంలో డిప్యూటి సిఎం భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలకు రాష్ట్రంలోని పేదలపై ప్రేమ లేదని… పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

కొందరు మాఫియాగా ఏర్పడి.. పేదల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ పేదల గురించి ఆలోచించే ప్రభుత్వమని.. నిజమైన పేదలు అయ్యుంటే.. ఇళ్లు లేని వారు ఉండొద్దనేది తమ ప్రభుత్వ ఆశయమని తెలిపారు. పేదలపట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తోందని చెప్పారు. తొలి ఏడాదే 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. త్వరలో మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని భట్టి స్పష్టం చేశారు.