
న్యూఢిల్లీ: వంట గ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్- అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ లో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడనున్నట్లు వస్తున్న వార్తలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందించారు. వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాపై భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ ముడి చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లోపే డెలివరీ అవుతుందని అధికారి వెల్లడించారు.
దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ అన్నారు. భారత ముడి చమురు సరఫరా స్థిరంగా ఉందని తెలిపారు. దేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుందని.. భారత్, దాదాపు 40 దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటుందని చెప్పారు. అంతేకాదు, భారత్ కు రెండు ముడి చమురు కార్గోలు రాబోతున్నాయని ఆమె తెలిపారు.