Reading Time: 3 minutes

తెలంగాణలో సంస్థాగత వృద్ధి రాజకీయ పట్టు కోసం భారతీయ జనతా పార్టీ వివిధ స్థాయిల్లో ఆలోచనలు సాగుతున్నాయి. అవకాశం ఉండి, ఆశించిన స్థాయిలో తెలంగాణలో పార్టీ ఎదగలేకపోతోందనే అసంతృప్తి బిజెపి ఢిల్లీ నాయకత్వానికి ఉంది. ఆ భావనను పార్టీ అగ్రనేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పలు సమీక్షా సమావేశాల్లో రాష్ట్ర నాయకులతో వ్యక్తం చేసినట్టు లోగడ వార్తా కథనాలు వచ్చాయి. పార్టీ జాతీయ ఇతర ముఖ్య నేతల్లోనూ ఒక అసంతృప్తి ఉంది. రాష్ట్ర పార్టీ లో ‘ఐక్యత’ కొరవడటమే ప్రధాన సమస్యగా ఉందని, పార్టీలో ఎప్పట్నుంచో ఉన్న బడానేతలు, కొత్తగా ఎదుగుతున్నవారు, ఇతర పార్టీల నుంచి వచ్చి స్థిరపడ్డవారూ ఉన్నప్పటికీ, వారి మధ్య సయోధ్య లేకపోవడం, ఉమ్మడిగా కార్యాచరణ లేకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకున్న అన్ని అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలనే అధినాయకత్వం ఎప్పటికప్పుడు ఉద్బోధిస్తోంది.

దేశంలో త్వరలో జరుగనున్న కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమబెంగాల్, అసోం అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై దృష్టి పెట్టాలని బిజెపి అధినాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. పాలకపక్షం కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్‌ఎస్ నుంచి బలమైన గ్రూప్‌లను పార్టీలోకి లాగి బిజెపిని బలోపేతం చేస్తే ఎలా ఉంటుందనే యోచన కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశించిన మేర ఫలితాలు దక్కలేదనే అసంతృప్తి ఉంది. కరీంనగర్ కార్పొరేషన్‌పై పార్టీ జెండా ఎగిరినా, నిజామాబాద్‌లో మెజారిటీ స్థానాలు దక్కినా.. అక్కడి స్థానిక పరిస్థితులు, ముఖ్యంగా ‘హిందుత్వ’ అంశం వంటివే తప్ప పూర్తి ఘనతను నాయకత్వానికే ఇచ్చే పరిస్థితి లేదు. 8 మంది చొప్పున పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలున్నా పార్టీకి ఎన్నిదగిన రీతిలో ఫలితాలు రాలేదు. నగర- పట్టణ పార్టీగా బిజెపికి పేరుండి, మున్సిపల్ ఎన్నికల్లోనే తగు ఫలితాలు రాబట్టకుంటే ఇక పల్లె ప్రాంతాల్లో చొచ్చుకుపోయి ముద్రవేయడం కష్టమౌతుంది కదా? అన్నది వారి ఆందోళనగా ఉంది.

కొట్టిపారేయలేని వాదన!

రాష్ట్రంలో పాలక కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామంటే తామని బిఆర్‌ఎస్, బిజెపి ఇద్దరూ అనుకుంటున్నారు. బిజెపితో కలిసి సాగే ప్రసక్తే రాదని బిఆర్‌ఎస్, అసలు బిఆర్‌ఎస్‌తో పొత్తుకు ఆస్కారమే లేదని బిజెపి బల్లగుద్ది చెబుతున్నాయి. రెండు పార్టీల నాయకత్వం కూడా ‘మేం కలువబోం’ అని బహిరంగంగా ప్రకటిస్తోంది. కలుస్తారనే స్పష్టమైన సంకేతాలు కూడా లేవు. కానీ, లోపల ఏదో ఇరువురి మధ్య సఖ్యతకు ఆస్కారం ఉందనే అభిప్రాయం ఉభయ పార్టీ కార్యర్తల శ్రేణుల్లోనే కాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంత పౌరుల్లోనూ వినిపిస్తోంది. ‘చూస్తూ ఉండండి, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాయి, కాంగ్రెస్‌ను గద్దె దింపుతాయి’ అంటూ రాజకీయాల్లో తలపండిన రిటైర్డ్ టీచరొకరు చేసిన వ్యాఖ్య క్షేత్రంలో ప్రచారాలకు అద్దం పడుతోంది. ‘బిఆర్‌ఎస్‌తో పొత్తుండదు’ అని రామచందర్ రావు పదే పదే చెబుతున్నా, ఇటువంటి విషయాల్లో రాష్ట్ర నాయకత్వం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేంద్ర నాయకత్వం నిర్ణయాలు రుద్దడమే బిజెపిలో ఎప్పుడూ జరిగేది. తెలంగాణలో మేం సంపూర్ణ ఆధిక్యతకే యత్నిస్తాం, నేరుగా మేం ఆధిపత్యం చూపలేని చోట కాంగ్రెస్ స్పేస్ తగ్గించడానికి కమ్యూనిస్టేతర, కాంగ్రేసేతర శక్తులతో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి?’ అనే చర్చ ఒకటి పార్టీలో ఉందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలైన ఎపి, తమిళనాడు, కేరళ, కర్నాటకలో ఇటువంటివి జరుగుతున్నపుడు, ఇక్కడ జరిగితే మాత్రం తప్పేంటి? అన్న వాదనలో లాజిక్ ఉందనిపిస్తుంది. ఆంతరంగిక చర్చల్లోనయినా ఇంతమేరకు బిజెపి నాయకులు మాట్లాడుతున్నారు తప్ప బిఆర్‌ఎస్‌లో మాత్రం ఒక మాట కూడా వినిపించడం లేదు. ఆ పార్టీలోని ముఖ్యులు కొందరిని బిజెపిలోకి చేర్చుకునే ప్రయత్నమేదో లోలోపల జరుగుతోందనే ప్రచారం చాలా కాలంగా తెంగాణ రాజకీయ వర్గాల్లో ఉంది.

ఫార్ములాల చర్చా సాగుతోంది

తెలంగాణలో బిజెపి -బిఆర్‌ఎస్ మధ్య పొత్తంటూ ఉంటే ఏం ఫార్ములా అనుసరిస్తారు? అన్నది అందరికీ ఆసక్తి కలిగించేదే! ఇది కూడా అక్కడక్కడ ప్రస్తావనకు వస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పక్షంలో 75ః25 , అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పక్షంలో 75ః- 25 శాతం స్థానాల నిష్పత్తిలో ఉభయ పార్టీలు అంగీకారానికి రావచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇటువంటి నమూనా ఒకటి గతంలోనే జాతీయ పార్టీలకు తమిళనాడులోని ద్రవిడ పార్టీలకు కుదిరేది. సాగినంత కాలం ఏ ఇబ్బందీ లేకుండా ఇటువంటి సఖ్యత వారిమధ్య నడిచింది. కానీ, జాతీయ పార్టీల ప్రాబవం తమిళనాట తగ్గిన దరిమిళా పరిస్థితులు, సమీకరణాలు అక్కడ కూడా మార్పునకు గురయ్యాయి. లోక్‌సభకు తాను ఎక్కువ స్థానాలు తీసుకొని, అసెంబ్లీ విషయంలో చెరి సమాన స్థానాల్లో పోటీ చేసి, మెజారిటీని బట్టి ముఖ్యమంత్రి పదవి తీసుకుందామనే ఫార్ములాకు బిజెపి పట్టుబట్టవచ్చన్న వాదన కూడా ఒకటుంది. ఇటువంటి నమూనాను ఇదివరకే బిజెపి మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో అనుసరించి, సుస్థిర ఫలితాలు సాధించిన అనుభవం ఉంది. అందుకు బిఆర్‌ఎస్ ఏ మేరకు అంగీకరిస్తుందన్నది వేచిచూడాల్సిందే! ‘ఎట్టి పరిస్థితిలోనూ, ఏ పక్షానికీ అనుకూలంగా వ్యవహరించకూడదు, మనకు వస్తే వచ్చింది, లేదంటే విపక్షంలోనే కూర్చుందాం’ అని మొన్నటి మున్సిపల్ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి రామారావు పార్టీ నాయకుల సమావేశంలో స్పష్టత ఇచ్చినట్టు బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కానీ, ఎన్నికల తర్వాత స్థానిక పరిస్థితులు, సందర్భాన్ని బట్టి మూడు పార్టీల వాళ్లూ గీతదాటిన సందర్భాలు కళ్లకు కట్టాయి.

బలం-బలహీనతలే నిర్ణయిస్తాయా?

ఎట్టి పరిస్థితుల్లోనూ బిఆర్‌ఎస్, బిజెపిలు కలవకూడదనే కాంగ్రెస్ కోరుకుంటుంది. వారిద్దరు విడివిడిగా పోటీ చేస్తేనే ఎన్నికల రాజకీయాల్లో తమ పరిస్థితి మెరుగ్గా ఉంటుందనేది వారి లెక్క! వేరెవరు పెద్దగా ప్రస్తావించకపోయినా, తరచూ కెసిఆర్ పేరు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు చేయడం వెనుక వ్యూహం ఉందని అంటారు. కెసిఆర్ తనకు తాను బలహీనపడ్డట్టు తలపోసిన రోజున, బిజెపితో పొత్తుకు ఆయన సిద్ధపడవచ్చని, అదే జరిగితే రాజకీయంగా తమకు నష్టమని రేవంత్‌రెడ్డి భావిస్తుండవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. కవిత పార్టీ నుంచి రాజకీయంగా, కుటుంబం నుంచి మనోభావాల పరంగా దూరమవటం కెసిఆర్‌ను కలతకు గురిచేస్తున్నట్టు ఆయనను సన్నిహితంగా ఎరిగిన వారు చెబుతారు. ఇటువంటి పరిస్థితుల్లో కెసిఆర్ ఒక గౌరవప్రదమైన రాజకీయ మార్గాంతరం ఎంచుకోవడంలో భాగంగా బిజెపితో సఖ్యత పొత్తుకు మొగ్గుతారా? అందుకు ససేమిరా అంటారా? అన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బిజెపి లోనూ ఓ అంతర్మథనం జరుగుతోంది. పార్టీ సిద్ధాంత నిబద్ధతపరంగా, సైద్ధాంతిక భూమిక అయిన సంఘ్ మద్దతుపరంగా రాష్ట్ర అధినేత రాంచందర్ రావు బలమైన నాయకుడే అయినా పార్టీని దూకుడుగా నడుపలేకపోతున్నారనే విమర్శ ఉంది. పార్టీ రాష్ట్ర విభాగంలో కొందరికి బిఆర్‌ఎస్ పట్ల సుహృద్భావం ఉంటే, మరికొందరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్ల సానుకూల ధోరణి ఉంది. ఆధారాలు లేకపోయినా, ఈ రకంగా కొన్ని ‘మ్యాచ్ ఫిక్సింగ్’లూ జరుగుతాయని పార్టీలోనే గుసగుసలున్నాయి. పార్టీలోని కొందరికి బిజెపి కేంద్ర నాయకత్వంపైన కూడా కినుక ఉంది. బిజెపి పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులకన్నా విరివిగా తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని వద్ద అపాయింట్‌మెంట్, ప్రాపకం లభించడాన్ని వారు అభ్యంతరపెడుతున్నారు. ఇలా ఇరుపక్షాల నుంచి చాలా అంశాలున్నాయి. రాజకీయ అవసరాల కోసం కారు, కమలం కలిసేనా? అన్నది రాగల కాలమే నిర్ణయించాలి.

దిలీప్‌రెడ్డి

సమకాలీనం

(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)