
ఎముకలు కుళ్లిన, వయస్సు మళ్లిన, అవినీతి పంకిలంలో నిండామునిగిన రాజకీయ వృద్ధ జంబూకాలకు గుణపాఠం చెబుతూ, భవిష్యత్తుపై కొండంత ఆశతో నవ యువతరానికి పట్టంగట్టింది పొరుగున ఉన్న హిమాలయ దేశం నేపాల్. అల్లర్లకు, ఆందోళనలకు, రాజకీయ అనిశ్చితికి పెట్టింది పేరైన నేపాల్‌లో మూడేళ్ల క్రితం కళ్లు తెరిచిన ఒక కొత్త పార్టీకి ప్రజలు భారీ మెజారిటీ కట్టబెట్టడం ప్రపంచ దేశాలను నివ్వెరపరిచిందంటే అతిశయోక్తి లేదు. దేశంలో పెచ్చరిల్లిపోతున్న అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలను పట్టించుకోకుండా విలాసాలలో మునిగితేలే రాజకీయ నేతల తీరుపట్ల విసిగివేసారిపోయిన ప్రజలు నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, నేపాలీ కమ్యూనిస్టు పార్టీ వంటి పేరొందిన పార్టీలను కట్టగట్టి ఓ మూలకు విసిరిపారేసి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్ పి)కి అందలం అప్పగించారు.
గత సెప్టెంబర్ నెలలో ఉవ్వెత్తున ఎగసిన జన్‌జడ్ ఉద్యమం ప్రధాని కెపి శర్మ ఓలి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడంతోనే యువతరం శక్తి ఏమిటో అర్థమైంది. యువతరం నాడి తెలుసుకుని, సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగిన ఆర్‌ఎస్‌పి.. అవినీతిని రూపుమాపి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి అధికారానికి దగ్గరైంది. 275 స్థానాల పార్లమెంటులో ప్రత్యక్ష ఓటింగ్ జరిగిన 165 సీట్లలో ఇప్పటికే మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన ఆర్‌ఎస్‌పి, మిగిలిన 110 సీట్లకు దామాషా పద్ధతిలో జరిగే ఎన్నికలోనూ తిరుగులేని విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. ర్యాపర్‌గా వృత్తి జీవితం మొదలు పెట్టి, రాజకీయాల్లోకి అడుగిడిన ముప్ఫయ్ అయిదేళ్ల బాలేంద్ర షా ప్రధాని అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే దేశ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన అతి పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించడం ఖాయం. తాజా ఎన్నికల్లో ఆయన మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని 50 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
దశాబ్దాల తరబడి రాచరిక పాలనలో మగ్గుతూ, ప్రపంచానికి దూరంగా ఉన్న నేపాల్, పద్ధెనిమిదేళ్ల క్రితం ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అయినా, తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి పార్టీల పుణ్యమాని, రాజకీయ అనిశ్చితితో అభివృద్ధికి ఆమడదూరంలోనే ఆగిపోయింది. ఏళ్ల తరబడి నేపాల్‌కు భారత్ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంటోంది. మౌలిక సదుపాయాలు, ఇంధనం, రక్షణ, వాణిజ్య రంగాలలో తలలో నాలుకలా వ్యవహరించే భారత్‌తో నేపాల్‌కు ఇటీవలి కాలంలో స్నేహ సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు వివాదాలు ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగమైన కాలాపాని, లిపులేక్, లింపియాధుర ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ పేచీపెట్టడమే కాకుండా ఆరేళ్ల క్రితం విడుదల చేసిన చిత్రపటంలోనూ అవి తమ భూభాగాలుగా చూపించడం వివాదాలకు ఆజ్యం పోసింది.
లిపులేఖ్ పాస్ మీదుగా భారత్ -చైనా వాణిజ్యానికి అడ్డు చెప్పడం ద్వారా నేపాల్ తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పట్ల బాలేంద్ర షా వైఖరి ఎలా ఉంటుందో వేచి చూడాలి. బెంగళూరులో ఎంటెక్ పూర్తి చేసి, ర్యాపర్ గా వృత్తి జీవితానికి శ్రీకారం చుట్టిన బాలేంద్ర నేపాల్ ప్రజలకు చిరపరిచితుడే. అవినీతి, సామాజిక అసమానతలపై పాటలు రచించి, పాడుతూ యువతరానికి ఆయన దగ్గరయ్యారు. తదనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఖాట్మండూ మేయర్ పదవిని అధిష్ఠించారు. అయితే, ఆయనది కూడా భారత్ వ్యతిరేక వైఖరేనన్నది గతంలో జరిగిన సంఘటనలను గమనిస్తే అర్థమవుతుంది.
ఆ మధ్య బాలేంద్ర విడుదల చేసిన ఒక రాజకీయ చిత్రపటంలో భారత్ లోని కొన్ని భూభాగాలను తమ దేశానికి చెందినవే అన్నట్లుగా చూపించడం వివాదాస్పదమైంది. అంతేకాదు, బాలీవుడ్ సినిమాలను నేపాల్‌లో నిషేధించాలని కూడా ఆయన ఒక సందర్భంగా డిమాండ్ లేవనెత్తారు. నేపాల్ ప్రయోజనాలే తనకు ప్రధానమంటూ ఎన్నికల ప్రచారంలో పదేపదే వల్లెవేసిన ఆయన తన ఎన్నికల నినాదాన్ని అనుసరించి, పటుతరమైన విదేశాంగ విధానానికి రూపకల్పన చేస్తారా లేక బంగ్లాదేశ్ మాదిరిగా చైనా తాయిలాలకు ఆశపడి అటువైపు మొగ్గు చూపుతారా అనేది ప్రశ్న. అంతకుమించి, ప్రజాభీష్టం మేరకు అవినీతికి అడ్డుకట్టవేసి, పారదర్శక పాలనను అందించడం, నిరుద్యోగాన్ని అంతమొందించడం ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు.