
అమరావతి: ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు… పెద్దలు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ప్రియుడి తల్లి, బంధువులు ఒప్పుకోకపోవడంతో యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకోగా యువతి చెట్టుకు ఉరేసుకొని చనిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈశ్వర్‌నగర్‌లో శివప్రసాద్, స్వప్న అనే యువతి యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకుంటామంటే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమజంట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. పోలీసులు ఇరువైపుల పెద్ద మనుషులను పిలిపించి పిఎస్ లో పెళ్లి జరిపించారు. కానీ శివ తల్లి ఒప్పుకోకపోవడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన వెంటనే యువతి గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందింది. ప్రస్తుతం శివ నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమార్తెను హత్య చేసి ఉరేశారని, శివ ఆత్మహత్యాయత్నం నాటకం ఆడుతున్నాడని స్వప్న తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. శివ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.