Reading Time: 2 minutes

ముంబై: టి20 ప్రపంచకప్ ట్రోఫీ సాధించిన టీమిండియాపై కనక వర్షం కురువనుంది. విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) రూ.131 కోట్ల నగదు బహుమతిని ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా అధికారికంగా వెల్లడించారు. గతంలో విజేతగా నిలిచిన టీమిండియాకు బిసిసిఐ రూ.125 కోట్లు అందించింది. ఈసారి దాన్ని రూ.131 కోట్లకు పెంచింది.

  టి20 ప్రపంచకప్‌లో టీమిండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. భారత్‌కు ఇది మూడో టి20 ప్రపంచకప్ ట్రోఫీ కావడం విశేషం. మరే జట్టు కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా అసాధారణ ఆటతో ఛాంపియన్‌గా అవతరించింది. లీగ్ దశలో భారత్ తన స్థాయికి తగ్గ ఆటను కనబరచలేదు. పసికూన అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో అతి కష్టం మీద విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు సర్వం ఒడ్డాల్సి వచ్చింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెమటోడ్చక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అష్టకష్టాలు పడింది. అయితే నమీబియాతో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం అలవోక విజయం సాధించి లీగ్ దశను అజేయంగా ముగించింది. కానీ సూపర్8 ఆరంభ మ్యాచ్‌లోనే ఎవరూ ఊహించని ఫలితం ఎదురైంది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది. సొంత గడ్డపై భారత్‌కు ఇలాంటి పరాజయం ఎదురవుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. అసాధారణ ఆటతో చెలరేగి పోయిన సఫారీ టీమ్‌ను భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఇలాంటి స్థితిలో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. లీగ్‌లో అదరగొట్టిన జింబాబ్వే, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో జరిగిన మ్యాచ్‌లు భారత్‌కు సవాల్‌గా మారాయి. ఈ జట్లను ఓడించి సెమీస్‌కు చేరడం టీమిండియాకు అంత తేలిక కాదని విశ్లేషకులు సయితం అంచనా వేశారు.

సంజు మార్క్ విజయం..

సఫారీ జట్టు చేతిలో ఘోర పరాజయం పాలైన భారత్‌కు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఊరట లభించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అలవోక విజయం సాధించింది. తర్వాత వెస్టిండీస్ జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌తో అదరగొట్టిన శాంసన్ 50 బంతుల్లోనే అజేయంగా 97 పరుగులుచేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లోనూ సంజు చెలరేగి పోయాడు. ఇంగ్లీష్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సంజు 42 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లోనూ సంజు అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురు దాడికి దిగిన సంజు 46 బంతుల్లోనే 89 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు.

బుమ్రా ముద్ర

మరోవైపు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూడా భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలువడంలో కీలక పాత్ర పోషించాడు. 8 మ్యాచుల్లో 12.43 సగటుతో 14 వికెట్లను పడగొట్టాడు. ఈ క్రమంలో 6.21 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఫైనల్లో అసాధారణ బౌలింగ్‌తో అదరగొట్టాడు. కీలక సమయంలో నాలుగు వికెట్లు తీసి జట్టును ఆదుకున్నాడు. అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లోనూ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక హార్దిక్, దూబె, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తదితరులు కూడా భారత్ విజయంలో తమవంతు పాత్ర పోషించారు. సూర్యకుమార్ యాదవ్ బ్యాట్‌తోవిఫలమైనా అద్భుత కెప్టెన్సీతో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు.