Reading Time: 3 minutes

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేందుకు భారత ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్న సమయంలో గత వారం అకస్మాత్తుగా తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిన గవర్నర్ల మార్పు రాజకీయ వర్గాలలో విస్మయం కలిగించింది. ముఖ్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ గవర్నర్‌లను మార్చడం ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలు రాజ్‌భవన్‌లను ‘రాజకీయ పునరావాస కేంద్రాలు’గా మార్చారని విమర్శలు చెలరేగగా, ప్రస్తుతం అవి బిజెపి ‘వార్‌రూమ్’లుగా మారినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు అడుగడుగునా అడ్డుపడుతూ, అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదింపకుండా, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాలను అసెంబ్లీలలో చదవకుండా ‘రాజకీయ పాత్రలు’ వహిస్తూ ఉండటంతో ఈ వివాదాలు సుప్రీంకోర్టు ముందుకు కూడా వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ అర్ధాంతరంగా రాజీనామా చేయడం, ఆయన స్థానంలో తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని నియమించడం రాజకీయ వర్గాలలో కలకలం రేకెక్తిస్తున్నది.

ఈ మార్పులు ‘పరిపాలన సామర్థ్యం’ కోసం కాకుండా, లోతయిన రాజకీయ ఎత్తుగడలతో భాగంగానే జరిగిన్నట్లు సర్వత్రా విశ్వసిస్తున్నారు. ఐపిఎస్ అధికారిగా పనిచేసి, నాగాలాండ్‌లో తిరుగుబాటు వర్గాలతో శాంతి ఒప్పందం కుదర్చడంలో విజయవంతమై ప్రధాని నరేంద్ర మోడీ దృష్టిని రవి ఆకర్షించారు. నిఘా, జాతీయ భద్రతా విభాగాలలో పనిచేసిన అనుభవం ఉండడంతో సున్నితమైన నాగాలాండ్ గవర్నర్‌గా నియమించారు. అయితే, అక్కడ బిజెపి భాగస్వామిగాగల సంకీర్ణ ప్రభుత్వం ఆయన తీరు నచ్చక ఆయనను బదిలీ చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో ఆయనను తమిళనాడు గవర్నర్‌గా నియమించి ‘పదవోన్నతి’ కల్పించారు. తమిళనాడులో అసెంబ్లీ ఆమోదించిన సుమారు 20 బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడంతో అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గవర్నర్ చర్యను ‘చట్టవ్యతిరేకం’ అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి ఎంకెస్టాలిన్ ప్రతిపాదించిన ఓ మంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునే అధికారం గవర్నర్‌లకు లేదని ధర్మాసనం స్పష్టం చేయడంతో ఆయన చివరకు ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో బిజెపి అధికారంలో ఉన్న అసోంలో మరోసారి గెలుస్తామని ధీమాతో ఉండగా, కేవలం పశ్చిమబెంగాల్‌లో మాత్రమే ఎట్లాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది. ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాలలో దాదాపు అన్ని రాష్ట్రాలలో బిజెపి ప్రభంజనం వీస్తున్నా ఈ రాష్ట్రంలో మాత్రం అధికారంలోకి రాలేకపోతున్నది. గత ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అస్త్రాలు ప్రయోగించినా కాంగ్రెస్, సిపిఎంలను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మాత్రమే చోటు సంపాదింపగలిగింది. అందుకనే, ఈ పర్యాయం లోక్‌భవన్ కేంద్రంగా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహంలో భాగంగా అందుకు సమర్థుడని భావించి ఆర్‌ఎన్ రవిని ఇక్కడకు బదిలీ చేసినట్లు పలువురు భావిస్తున్నారు. గవర్నర్‌ల మార్పును ప్రకటించేందుకు కొన్ని గంటల ముందే బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ తన రాజీనామాను ప్రకటించారు. ఢిల్లీలో పెద్దలను కలిసేందుకు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించారు. అందుకు ఎటువంటి కారణాలు ప్రకటించలేదు. కేవలం ‘వ్యక్తిగత, ఆరోగ్య’ కారణాలు అంటూ పొడిపొడిగా చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా మమతా ప్రభుత్వాన్ని ఎన్నికల సమయంలో ఇరకాటంలో పడవేయలేరనే ఆయనను అర్ధాంతరంగా బదిలీ చేసినట్లు పలువురు భావిస్తున్నారు.

మే, 2025లో రాజ్‌భవన్‌లో ఓ తాత్కాలిక మహిళా ఉద్యోగిని తనను గవర్నర్ లైంగికంగా వేధించారని చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలంరేపాయి. ఆ ఆరోపణలకు సంబంధించిన కేసు ఇంకా పోలీసులవద్దే ఉంది. అందుకనే మమతా ప్రభుత్వం పట్ల కఠినంగా వ్యవహరింపలేదని బిజెపి అధిష్టానం భావించి, ఆయనకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తున్నది. అయితే, లోక్‌భవన్‌ను ‘బిజెపి వార్‌రూమ్’గా మార్చితే తమిళనాడులో ఎంకె స్టాలిన్ సహనంతో, మర్యాదగా వ్యవహరించారు. న్యాయస్థానాలకు వెళ్లారు గాని గవర్నర్‌ను వీధులలో నిలదీసే ప్రయత్నం చేయలేదు. కానీ, మమతా రాజకీయ ప్రస్థానం వీధి పోరాటాల నుండి వచ్చింది. ఆమె ఇడీ, సిబిఐ కార్యాలయాలపై దాడులకు సైతం వెనకాడటం లేదు. చివరకు ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టులో దోషిగా నిలబెట్టి, తానే స్వయంగా వాదించారు. స్టాలిన్‌తో వ్యవహరించినట్లు ఆమెతో వ్యవహరిస్తే ఆమె గాండ్రిస్తారు. ఇప్పటికే బిజెపి నేతలను ‘బైటవారు’, తాను ‘బెంగాల్ కుమార్తె’ అంటూ రాజకీయ ప్రజలలో గుర్తింపు పొందుతున్న ఆమెను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకే రవి దోహదపడే ప్రమాదం కూడా లేకపోలేదు. ముఖ్యంగా ఎన్నికల ప్రకటన వెలువడగానే రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో ఉంటుంది. పరోక్షంగా గవర్నర్ అజమాయిషీలో ఉంటుంది.

ఆ విధంగా మమతను ఓడించేందుకు లోక్‌భవన్ నుండి రవి ద్వారా పావులు కదిపేందుకు బిజెపి ఎత్తుగడగా కనిపిస్తున్నది. ఇప్పుడు బిజెపి ఎన్నికలలో విజయం కోసం ఓటర్లపై, బాలట్ బాక్స్ లపై కాకుండా ఎన్నికల కమిషన్, గవర్నర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను సైతం ఈ దృష్టాంతంతోనే చాలామంది చూస్తున్నారు. అయితే, బిజెపికి క్షేత్రస్థాయిలో ప్రజలలో పట్టగలిగిన నాయకత్వం, ప్రజాకర్షణ కలిగిన నాయకత్వం లేకపోవడంతో కేంద్రం ఎన్ని ఎత్తుగడలు వేసినా అవి వికటించి, ప్రతికూలంగా మారుతున్నాయని విషయాన్ని మరచిపోతున్నారు.ఎస్‌ఐఆర్ పక్రియ ద్వారా లక్షల సంఖ్యలో ఓటర్లను తొలగించగా, బెంగాల్‌లో గత ఎన్నికలలో గెలిచినా అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఓట్లకు మించి ఎక్కువ ఓట్లను 35 నియోజకవర్గాలలో తొలగించారని చెబుతున్నారు. ఆ విధంగా ఆయా నియోజక వర్గాలలో ఫలితాలను తారుమారు చేయాలనే వ్యూహం కనిపిస్తుంది. అయితే, ఆ విధంగా ఓట్లు తొలగించిన 35 నియోజకవర్గాలలో 22 బిజెపి అభ్యర్థులు గెలుపొందిన నియోజక వర్గాలు కావడం గమనార్హం.

అంటే ఎస్‌ఐఆర్ ప్రక్రియ బిజెపి అభ్యర్థులకు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది. పైగా, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్‌లో బిజెపి అంతర్గత కుమ్ములాటలతో బలహీనం అవుతూ వస్తున్నది. పలువురు కీలక నాయకులు పార్టీని విడిచిపెట్టారు లేదా క్రియాశీలకంగా పనిచేయడం లేదు. ఆ ఫలితంగానే 2024 లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ ఎంపిల సంఖ్య 18 నుండి 12కు తగ్గింది. దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేస్తున్న నాయకులకు, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకు మధ్య సయోధ్య కనిపించడం లేదు. కేంద్ర నాయకత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నా ఐకమత్యంగా వారితో పనిచేయించడం కనిపించడం లేదు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మమతా ప్రజలకు దగ్గరవుతున్నారు. ముఖ్యంగా మహిళలో ఆమె తిరుగులేని నాయకురాలు. మమత ‘స్థానిక- బయటివారు’ ప్రచారంతో ఇతర రాష్ట్రాలలో మాదిరిగా ప్రధాని మోడీ, అమిత్ షా వంటి నేతల ప్రచారం ఈ రాష్ట్రంలో బిజెపికి ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది.

చలసాని నరేంద్ర

98495 69050