Reading Time: < 1 minute

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి కల్తీ పాల ఘటనలో రెయిన్ బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి మృతి చెందాడు. మూడేళ్ల జయకృష్ణ 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. జయకృష్ణ మృతితో తీవ్ర విషాదంలో తల్లిదండ్రులు మునిగిపోయారు. గడచిన 25 రోజులుగా చిన్నారికి నయమవుతుందని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. బాలుడు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు చనిపోవడంతో ప్రభుత్వం న్యాయం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కల్తీపాల ఘటనలో మృతి చెందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా డిమాండ్ చేశారు. ఇంకా ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్టు సమాచారం. 11 ఏళ్లుగా లైసెన్స్ లేకుండా వరలక్ష్మి డైరీ నడుస్తుంటే  ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిలా ప్రశ్నించారు. ఎపిలో పాలు కల్తీ, నెయ్యి కల్తీ, మద్యం కల్తీ, వాగ్ధానాలు కల్తీ, చంద్రబాబు పాలన కల్తీలాగా తయారయ్యిందని షర్మిల విమర్శించారు. ఎఐ మీద కాదు దృష్టి పెట్టాల్సింది, ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలని సూచించారు.