
ప్రపంచీకరణ యుగంలో ఒక మూలలో పేలే తుపాకీ శబ్దం, మరో మూలలోని సాధారణ మనిషి జీవితాన్ని కుంగిపోయేలా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇలాంటి పరిస్థితినే సృష్టిస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని ప్రతి ఇంటి వంటగదిలో ఈ యుద్ధ గర్జన వినిపిస్తున్నట్టుగానే, చమురు ధరలు పెరిగి, కూరగాయలు, ధాన్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ ఖరీదవుతున్నాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ గొలుసులా అనుసంధానమై ఉన్నందున, దాని తీవ్ర ప్రభావం భారతీయ సామాన్య ప్రజల జీవన వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రమాదాలు తీసుకురావచ్చు? ప్రభుత్వం, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవి చర్చించాల్సిన అత్యవసర అంశాలు. పశ్చిమాసియా ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. హోర్ముజ్ జలసంధి వంటి మార్గాల ద్వారా ప్రతి రోజూ లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ ప్రపంచ మార్కెట్‌కు సరఫరా అవుతుంది.
ఇక్కడ యుద్ధం లేదా ఉద్రిక్తతలు పెరిగితే, ఈ సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడటం సహజం. ఫలితంగా అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. భారతదేశం తన ఇంధన అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. కాబట్టి, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు తప్పకుండా పెరుగుతాయి. ఇటీవలి రోజుల్లోనే ఇరాన్-ఇజ్రాయెల్ టెన్షన్‌లు పెరిగిన తర్వాత, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 10 డాలర్లు పైబడి పెరిగాయి. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) అంచనాల ప్రకారం, దేశ ద్రవ్యోల్బణాన్ని 0.5-1 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఇంధన ధరల పెరుగుదల అంటే కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు; అది మొత్తం ఆర్థిక వ్యవస్థను కదిలిస్తుంది. రవాణా ఖర్చులు పెరిగితే, రైతు పొలంలో పండిన కూరగాయలు, పప్పులు, ధాన్యాలు నగర మార్కెట్లకు చేరే దాకా ప్రతి దశలో వ్యయం పెరుగుతుంది. ఉదాహరణకు, రవాణా ఖర్చు పెరగడంతో కిలో టమాటా 20 -30 రూపాయలు ఎక్కువగా పలికే అవకాశం ఉంది.
ఇది మధ్య, దిగువ తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరోవైపు, ఎర్రసముద్రం మార్గంలోని ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. భారతదేశం నుంచి యూరప్‌కు వెళ్లే 40% సరుకులు ఈమార్గం ద్వారానే ప్రయాణిస్తాయి. హౌతీ తిరుగుబాటుదారుల దాడులు పెరిగితే, నౌకలు ఆఫ్రికా చుట్టూ పొడవైన మార్గాలు ఎంచుకోవాల్సి వస్తుంది. ఫలితంగా, రవాణా సమయం 10-15 రోజులు పెరిగి, ఖర్చులు 20-30 శాతం పెరుగుతాయి. బీమా ప్రీమియంలు కూడా డబుల్ అవుతాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యయనం ప్రకారం, ఈ మార్గం పూర్తిగా మూసివేయబడితే, దిగుమతి వస్తువుల ధరలు 5-10 శాతం పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్రాలు, మొబైల్ ఫోన్లు అన్నీ చైనా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ ధరల పెరుగుదల పరిశ్రమలు, వినియోగదారులపై భారం పడుతుంది.
ఇటీవలి నెలల్లో ఎర్ర సముద్రంలో దాడులు పెరిగిన తర్వాత, ఓడ ఖర్చులు 40% పెరిగాయి, ఇది భారత ఎగుమతులపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం. చమురు దిగుమతులకు ప్రత్యామ్నాయ దేశాలైన రష్యా, అమెరికా, ఆస్ట్రేలియాతో ఒప్పందాలు పెంచడం, వ్యూహాత్మక చమురు నిల్వలు (90 రోజుల అవసరం) సమర్థంగా వాడడం వంటివి ధరలను కొంత నియంత్రించగలవు. తాత్కాలికంగా పెట్రోల్, డీజిల్‌పై పన్ను సడలింపులు ఇవ్వడం, రవాణా రంగానికి సబ్సిడీలు ప్రకటించడం ఉపయోగకరం. దీర్ఘకాలికంగా, పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెంచడం – సోలార్, విండ్ ఎనర్జీలో 50 జిడబ్లు లక్ష్యం వేసుకోవడం – దిగుమతి ఆధారాలను తగ్గిస్తుంది. ఈ సంక్షోభం మనకు ఒక పాఠం. యుద్ధం ఎక్కడ జరిగినా, దాని బాధను భరించేది సామాన్య ప్రజలే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలంటే అంతర్జాతీయ సంభాషణలు, దౌత్య పరిష్కారాలు అవసరం. భారతదేశం వంటి దేశాలు యుఎన్, జి20 వేదికలపై శాంతి ప్రయత్నాల్లో ముందుండాలి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే, భారతీయ వంటగదుల్లో నిశ్చింతం తిరిగి వస్తుంది. ఇది కేవలం ఆర్థిక అంశం కాదు, మానవతా విలువల సమస్య.
ఎక్కులూరి నాగార్జున్ రెడ్డి,
9032042014