Reading Time: < 1 minute

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసన ప్రదర్శన చేస్తే నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేస్తారా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీరు ఇచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేది కదా? అని ఆయన తెలిపారు.

బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరు ఇవ్వని రైతు ద్రోహి కెటిఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత బిఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు వరసుగా పంటలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తమకు న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయం అని ఆయన విమర్శించారు. వెంటనే వారిని విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.