
నేను, నా సాహితీ యాత్ర: మెహఫిల్ తెలుగు రచయితలను, వారి సాహితీ కృషిని పరిచయం చేసేందుకు “నేను, నా సాహితీ యాత్ర” అనే నూతన ధారావాహిక శీర్షికను ఈ నూతన సంవత్సరం నుండి ప్రారంభిస్తు న్నది. తమ జీవన యానం, సాహితీ సృజన, పొందిన పురస్కారాలు, సాహిత్యం గురించి వారు ఏమి అనుకుంటున్నరో వారి మాటలలోనే విందాం. రచయితల అనుభవాలు, రచనలు దారిలో వెలిగే దీపాల వంటివి. వారి అంతరంగాన్ని, రచనల ఆంతర్యాన్ని తెలుసుకుందాం.
విమల, మెహఫిల్ గెస్ట్ ఎడిటర్
ఉద్రాక్షపూలు పూసినంత సహజంగా మాటలు పూసే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. ఆరుగాలం కష్టం చేసినా సంసారం ఎల్లని వ్యవసాయ కుటుంబం మాది. ఎవరూ ఆసరా లేకపోయినా, కొట్లాడి, నిలబడి, జీవితం నిలబెట్టుకున్న బాపు, ఎత ఎవలదయినా విని, కరిగి, కన్నీరయి ఒలికే అవ్వ, వెనుక దర్వాజ, ముందు దర్వాజ తెరిచి, గోసగోసగా వచ్చే మనుషుల హృదయం తెరచి కష్టసుఖాలు పంచుకుని, ధైర్యం నూరిపోసే పురా స్మృతుల చరిత్ర వంటి ఇల్లు, ఆడినన్ని ఆటలు, పాడినన్ని పాటలు, తిరిగినన్ని చెలకలు, తిన్నన్ని పండ్లు, కాయలు, తీరికలేనంత తీపి బాల్యం, ఒక్క పాండిత్యం తప్ప కవిగావటానికి ఏమేం కావాలో అవన్నీ పుష్కలంగా అల్లుకొని ఉన్న జీవ వాతావరణం నడిమి నుంచి నడిచి వచ్చాను. పొద్దున లేస్తే ఏదో ఒక పాట వినిపించేది. ఎటుచూస్తే అటు ఎండినదో, పచ్చనిదో చెట్టు కనిపించేది. ఎగిరే పక్షి ఒక ప్రేరణ, పాకే పాము ఒక మెలకువ, ఒక చెరువు, వందల బావులు, వేల చేన్లు, గొర్ల మందలు, పశువుల మందలు, కంచెలు, మంచెలు, రాత్రయితే భాగోతాలు, భజనలు, ఒగ్గు కథలు, శారదకథలు, కథలు, కథలుగా కదిలే మనుషులు, ఊరి జనం కష్టాలు చూసి రాజకీయ నాయకుణ్ణి కావాలనుకున్నాను గాని, కవినయ్యాను. తెలియక ఏదేదో కావాలనుకున్నాను. తెలిసికలగన్నది కైకట్టింది కవిత్వమే.
జీవించడానికి ఉద్యోగం కావాలి గదా, ఎం.ఏ తెలుగు చేసి, పరిశోధన చేసి, డాక్టరేట్ పొంది డిగ్రీ కళాశాల ఉద్యోగం పొందాను. చేతనయినంత ఉత్సాహంతో పాఠాలు చెప్పాను. కవులుగా నో, గాయకులుగానో, ఉద్యోగులుగానో, ఉద్యమ కారులుగానో, నాయకులుగానో, ఎదిగిన విద్యార్థుల్ని చూసి ఆనందించాను. ఉపన్యాసాలు చేయ డం ఇష్టం. ఉద్యోగ విరమణ తర్వాత సైతం ఉపన్యాసాలు ఇష్టం. హృదయాన్ని కల్లోల పరిచిన జీవితాన్ని హృదయాలను తాకే సాహిత్యంగా మలచటం ఇష్టం. మరో పని పెట్టుకోలేదు. రచనే పని. రచనే జీవితం. తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు రచనకు దారి దొరికింది. తెలుగు వాచకం చదువుతుంటే పాఠాలు ఆకర్షించాయా, పద్యాలు ఆకర్షించా యా, పాటలు, కథలు ఆకర్షించాయా.. ఏవేవి ఎప్పుడెప్పుడు వెంటాడుతున్నాయోగాని, అష్టకాల నరసింహరామ శర్మ “శిథిల విపంచి పద్యాలు” నన్ను దారి మళ్లించాయి. సరదాకు రాజకీయా లు, సంపాదనకు రాజకీయాలు గానీ, సాహిత్య ప్రపంచమే సరైన దారిగా, నా తత్వానికి నప్పినదారిగా తోచింది. పద్యాలు పట్టుకున్న తర్వాత కొమురవెళ్లి మల్లికార్జునస్వామి మీద శతకం రాశాను.
ఊరిమీదా, రైతుమీదా పద్యాలు రాశా ను. సిద్దిపేట కళాశాలలో చేరిన తరువాత సినిమాల పిచ్చి, సినిమా పాటల పిచ్చి, సినారె ఆకర్షించాడు. మహమూద్ పాషా, భగవంతరెడ్డి, శాఖా గ్రంథాలయం, కళాశాల నవ సాహితి, కవి సమ్మేళనాలు కొత్త ప్రపంచం. కవిత్వ ప్రపంచం. లెక్కతప్పి లెక్కల నుంచి కవిత్వంలో మునిగితేలా ను. బిచ్చగాడు అచ్చయిన మొదటి కవిత. మహమూద్ పాషా, సిద్ధారెడ్డి జంట రచన. స్థానిక ‘మాతృ భూమి’ పత్రికలో వచ్చింది. తర్వాత విప్లవ కవిత్వం వైపు చూపు. మినీ కవిత్వం అప్పటి ట్రెండ్. సాహసం చేసి కందుకూరి శ్రీరాములు, కర్ణాల బాలరాజు, సిద్ధారెడ్డి త్రిమూర్తుల ‘దివిటి’ ప్రచురించాం. మినీ కవితా ధోరణిలో తెలుగులో మొదట వెలువడిన సంకలనం దివిటీయే. నా సాహిత్య ప్రయాణాన్ని మలుపుతిప్పిన సంవత్స రం 1974. సరిపల్లి కృష్ణారెడ్డి విప్లవ రాజకీయాలు పరిచయం చేశాడు. సూరపనేని జనార్ధన్‌ను పరిచేయం చేశాడు. ఒకవైపు విప్లవ చలనాలు. మరొకవైపు సాహిత్య చలనాలు.
‘భూమి స్వప్నం’ నా మొదటి కవితా సంపుటి 1987లో వచ్చింది. అది మొదలు.. సంభాషణ, ప్రాణహిత, ఒకబాధ కాదు, నది పుట్టువడి, ఇక్కడి చెట్లగాలి, నీటి మనసు ఏడు కవితా సంపుటాలు ప్రచురించాను. ‘అనిమేష’ కావ్యం రచించాను. ‘నాగేటి సాల్లల్ల’ పాటల సంపుటి వెలువడింది. ‘ఇగురం’ ఆవర్తనం విమర్శ వ్యాసాలు, తెలుగు కవిత్వంలో సూర్యుడు, వాస్తవికత, అధివాస్తకవి త, పరిశోధనా గ్రంథాలు, ‘చిత్రకన్ను’, ‘బందా రం కథలు’ కథా సంపుటాలు. ఇటీవల మా బాపు జీవిత కథ నేపథ్యంలో రాసిన నవల ‘నాగటి తరం’ చరిత్ర. సమాజం ఎట్లా గుర్తించినా సృజనకారుడికి అన్ని సాహిత్య ప్రక్రియలు సమానమే అని నా భావన. పద్యాలతో మొదలయ్యాను. వచన కవిత్వంలో స్థిరపడ్డాను. సందర్భం ఒత్తిడి చేస్తే పాటలు రాశాను. ‘నాగేటి సాల్లల్ల’ పాటకు చాలా గుర్తింపు వచ్చింది. వీర తెలంగాణ సినిమాలో జేసుదాసు పాడాడు. ఆ పాటకు 2010 ఉత్తమ సినీ గీతంగా నంది పురస్కారం వచ్చింది. కథలు, నవలతో పాటు నాటకం కూడా రాశాను. అనుకోకుండా నాలుగు నృత్య రూపకాలు రాశాను. ఇందిరా పరాశరం, కూచిపూడి నృత్య కళా దర్శకత్వంలో తెలంగాణ, అన్నదాత, దాశరథి నృత్యరూపకాలకు బాగా పేరొచ్చింది. ఏ రచయితా పురస్కారా ల కోసం రాయకపోవచ్చు. కానీ, కోరుకోవచ్చు. సృజనకు అదొక కొలమానం కావొచ్చు.
‘భూమి స్వప్నం’ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, దాశర థి అవార్డు అందుకున్నది. ‘ఒక బాధ గాదు విశ్వ కళాపీఠం’ పురస్కారం అందుకున్నది. ప్రాణహితకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కా రం ప్రకటించదలచుకున్నప్పుడు రైతు ఆత్మహత్య ల నేపథ్యంలో తిరస్కరించాను. ప్రస్తుత తెలంగా ణ ప్రభుత్వం కోటి రూపాయల బహుమతి ప్రకటించదలిస్తే “తెలంగాణ తల్లి చేతి బతుకమ్మ” తొలగించిన నేపథ్యంలో తిరస్కరించాను. నచ్చిన సందర్భాల్లో కొన్ని స్వీకరించాను. తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, తేజా ఆర్ట్ పురస్కా రం, సదాశివుడి పురస్కారం, సినారె జీవన సాఫల్య పురస్కారం, పల్లా దుర్గయ్య పురస్కారం, బి.ఎన్.సాహిత్య పురస్కారం మరికొన్ని పురస్కారాలు ఆత్మీయంగా స్వీకరించాను.
రచయిత పురస్కారాలు దాటి హృదయాల్లోకి చేరుకోవాలని భావిస్తాను. రచనను సామాజిక బాధ్యతగా భావిస్తాను. ప్రజలిచ్చే గుర్తింపే అన్నింటికంటే పెద్దది. ఏ రచనయినైనా నిలబెట్టేది ప్రజలే. ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎంత శిల్ప చాతు ర్యం ప్రదర్శించినా, ఎన్నెన్ని భాష ల అనువాదాలు సంతరించినా రచనకు ప్రమాణం సహజమే. రచనకు సాఫల్యత హృదయ స్పందనే జీవితం. రాయటం ద్వారానే జీవితానికి చేరువవుతాం. తమ సాహిత్యానికి ఖ్యాతి రాలేదని, సముచిత గుర్తింపు రాలేదని ఉక్రోషపడే రచయితల్ని చూస్తుంటాం. ఉక్రోషం ద్వారా గుర్తింపు రాదు. ఉత్తమ రచనతోనే గుర్తింపు వస్తుంది. ఉత్త మ రచనకు నిజాయితీ ముఖ్యం. హృదయం ముఖ్యం. ఉత్తమ రచన ఎప్పుడైనా, ఏ భాషలో నైనా జీవితం నుంచే రూపొందుతుంది. పుస్తకాలు శిల్ప నైపుణ్యానికి, రచనా నైపుణ్యానికి ఉపయోగపడవచ్చు. జీవితమే సాహిత్యానికి ఆయువు, ప్రాణ వాయువు.
– నందిని సిధారెడ్డి