
హైదరాబాద్: అసెంబ్లీలో మాజీ సిఎం కెసిఆర్ తప్పులు చేశారనే తప్ప..కృష్ణా నది నీటి వాటాలపై చర్చ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తుంగభద్ర, కృష్ణా నీటిపై కర్ణాటకతో పేచీ ఉంటే.. రెండూ కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా.. ఎందుకు పరిష్కించడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై సిఎం రేవంత్ రెడ్డి నిందలు వేస్తూ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారని విమర్శించారు. బిఆర్ఎస్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఒక గుంపును తయారు చేస్తున్నారని, చట్టసభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం సరికాదని అన్నారు. హరీష్ రావు నిర్ణయాలతోనే సాగునీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరుగుతోందని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకోవడానికే జూరాల నుంచి నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టును హరీశ్‌రావు.. శ్రీశైలానికి మార్చారని ధ్వజమెత్తారు. ఆయన ధనదాహం వల్ల పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల ప్రజల నోట్లో మట్టి కొట్టారని, హరీశ్‌రావు చేతుల్లో రాష్ట్ర ప్రజలు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు ‘గుంట నక్క’గా కవిత అభివర్ణించారు.