Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్:  చికెన్ ధర చిరాకు పెట్టిస్తుంది. కిలో చికెన్ రేటు ట్రిపుల్ సెంచరీ చేసింది. రోజు రోజుకు చికెన్ రేటు భారీగా పెరుగుతుండడంతో మాంసం ప్రియులు చేపలు, మటన్ వైపు మొగ్గుచూపుతున్నారు. కిలో చికెన్ తెచ్చుకునే బదులు ఇంకో రూ. 150 పెడితే అర కిలో మటన్ వస్తుందని అటు వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకటేంటి అన్నీంటి ధరలు రోజు రోజుకీ పెరుగుతుంటే సగటు జీవికి బ్రతుకు భారమవుతోంది. కూరగాయల కన్నా కోడి గుడ్లు ధరలు తక్కువ ఉంది కదా అని సరిపెట్టుకుందామంటే కోడి గుడ్డు ధర కూడా రూ.8కి పైగానే రిటైల్ మార్కెట్‌లో ధర పలుకుతుంటే సాధారణ ప్రజలు హడలిపోతున్నారు. దీనికితోడు సాధారణ ప్రజలకు తక్కువ ధరలో లభించే మాంసాహారమైన బ్రాయిలర్ కోడి మాంసం ధర కూడా ప్రతి రోజు పెరిగి, ఆదివారం నాటికి కిలోధర రూ.280 నుంచి 310కి చేరింది. దీంతో చికెన్ ధరలు ఒక వైపు, కోడి గుడ్ల ధరలు మరో వైపు భారీగా పెరుగుతూ మార్కెట్‌ను షేక్ చేస్తున్నాయి. దీంతో సామాన్యులు హడలిపోతున్నారు. న్యూఇయర్ వేడుకలతో పాటు సంక్రాంతి పండుగ ఉండడంతో చికెన్ రేటు భారీగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. నాణ్యమైన మటన్ కు మార్కెట్ కిలో రూ.1000 వరకు ఉంటుంది. చెంగిచర్లలో కిలో మటన్ ధర రూ.500 లలో ఉంటుంది.