
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కొనసాగకుండా ఉండాలంటే, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాల్సిందేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. ఆటో అన్నలు కోరినట్లుగానే వారికి ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనను చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కెటిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నిస్తే, నిర్బంధాలు, అరెస్టులతో గొంతు నొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో డ్రైవర్ల జెఎసి నేతలను, వేలాది మంది ఆటో డ్రైవర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లను, ఆటో యూనియన్ల నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తోందని ఆరోపించారు. వేలాది మంది ఆటో డ్రైవర్లను రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో అదుపులోకి తీసుకొని బంధించి ఉంచడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన ఆటో యూనియన్ల నేతలను, ఆటో అన్నలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.