
ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం గణేశ్‌పాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపు తప్పి కాల్వలో బోల్తా పడింది. వేంసూరు మండలం మద్దులగూడెంలోని వివేకానంద విద్యాలయం బస్సు సుమారు వంద మందితో కలిసి గణేశ్‌పాడు, ఎల్ఎస్ బంజరు, కెఎం బంజరు, మార్లకుంట, ముత్తుగూడెం తదితర గ్రామాలకు బయలుదేరింది. గణేశ్‌పాడు గ్రామ శివారులోకి రాగానే డ్రైవర్ వేగంగా బస్సు నడపడంతో అదుపు తప్పి కాల్వలోకి పల్టీ కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కాల్వలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిది. పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లడం కూడా ప్రమాదానికి గల కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపాడని విద్యార్థులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను విద్యార్థుల తల్లిదండ్రులు, విఎం బంజరు పోలీసులు.. పెనుబల్లి, ఎపిలోని ఎన్టిఆర్ జిల్లా తిరువూరులోని ప్రైవేటు వైద్యశాలలకు తరలించారు.