Reading Time: < 1 minute

టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేశాడు. 2025 చివర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు, 1 అర్థశతకం చేసి.. ఆ ఏడాదిని ఘనంగా ముగించాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలో మరో మూడు రికార్డులు విరాట్‌ను ఊరిస్తున్నాయి. ఐపిఎల్‌లో విరాట్ ప్రస్తుతానికి టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. 259 ఇన్నింగ్స్‌లో 8,681 పరుగులు చేశాడు. అయితే మరో 339 పరుగులు చేస్తే ఐపిఎల్‌లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకొనే అవకాశం ఉంది. ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో 267 ఇన్నింగ్స్‌లో 7,046 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక విరాట్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫునే ఆడుతున్న విషయం తెలిసిందే.

ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ జనవరి 11న ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో విరాట్ 42 పరుగులు చేస్తే.. అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి కుమార సంగక్కర పరుగుల రికార్డును దాటే అవకాశం ఉంది. సంగక్కర 28,016 పరుగులు చేయగా.. విరాట్ ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌లో 27,975 పరుగులతో ఉన్నాడు. మూడు ఫార్మాట్‌లలో అత్యధిక స్కోర్ చేసిన లిస్ట్‌లో సచిన్ తొలిస్థానంలో ఉన్నారు. ఆయన 34,357 పరుగులు చేశారు. ఇక వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే.. 15,000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో 296 ఇన్నింగ్స్‌లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో మొదటిస్థానంలో సచిన్ టెండూల్కర్‌ ఉన్నారు. సచిన్ 452 ఇన్నింగ్స్‌లో 18,426 పరుగులు చేశారు. ఇప్పటివరకు సచిన్ ఒక్కడే వన్డేల్లో 15వేలకు పైగా పరుగులు చేశారు.