
హైదరాబాద్: మూసీ నది అనంతగిరిలో ప్రారంభమై వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ నది దాదాపుగా 240 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుందని, హిమాయత్‌సాగర్ ఎగువన మూసీలో ఈసా నది కలుస్తుందని వివరించారు. శాసన సభలో మూసీ సుందరీకరణపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. లంగర్‌హౌస్ బాపూఘాట్ వద్ద రెండు నదులు కలుస్తున్నాయని, ఈసాకు హిమాయత్‌సాగర్, మూసీకి ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులు ఉన్నాయని, కాకతీయుల నుంచి నిజాం వరకు నదీ పరివాహకంలోనే ప్రాజెక్టులు చెపట్టారని, వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించేందుకు 1908లో ఉస్మాన్ సాగర్ చేపట్టారని, 1922 నాటికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టారని, నిజాంలు నిర్మించిన ప్రాజెక్టులే నగర ప్రజల దాహార్తి తీరుస్తున్నాయని రేవంత్ గుర్తు చేశారు. గతంలో జలవనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని, జలవనరులను కలుషితం చేసి కబ్జాలు పెట్టి ఫాంహౌస్‌లు కట్టారని, ఫాంహౌస్‌ల డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారని, నిందితులపై ఉక్కుపాదం మోపి డ్రైనేజీలను కూలగొట్టామని తెలియజేశారు.
నదీ పరివాహక ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా నిజాంలు తీర్చిదిద్దారని, ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీపడేలా నిజాంలు తీర్చిదిద్దారని, నిజాంలు చేసిన అభివృద్ధిని కనుమరుగు చేశారని, నదులను కలుషితం చేసి నివాసయోగ్యం కాని ప్రాంతాలుగా చేశారని మండిపడ్డారు. హైదారబాద్‌లో మురుగు కాలువలను మూసీ నదికి కలిపారని దుయ్యబట్టారు. మూసీ నది కలుషితం వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు జీవించలేదని పరిస్థితి నెలకొందన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణపై అధ్యయనం చేశామని రేవంత్ వివరించారు. లండన్ జపాన్, జర్మనీ, దక్షిణకొరియా సింగపూర్‌లో అధ్యయనం చేశామన్నారు. ప్రపంచ స్థాయి నగరాల్లో నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకొని వ్యాపార కేంద్రాలుగా మార్చారని, ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆయా దేశాలు పోటీపడుతున్నాయని, గుజరాత్‌లో సబర్మతి నది అభివృద్ధి కోసం 60 వేల కుటుంబాలను తరలించారని, ఉత్తర ప్రదేశ్‌లో గంగా నది ప్రక్షాళన చేసి రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేశారని, నది పరివాహక ప్రాంతాల అభివృద్ధిని బిజెపి ఎన్నికల అజెండాగా మార్చారని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను వ్యతిరేకించడంలేదని, నదీ పరివాహక ప్రాంతాల నిర్వాసితులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తామన్నారు.