Reading Time: < 1 minute

ఢాకా : బంగ్లాదేశ్ లో దమనకాండ తారస్థాయికి చేరింది. మరో హిందూ యువకుడిపై అమానుష మూక హత్యాయత్నాకి ఒడిగట్టింది. ఖోకోన్ దాస్ అనే వ్యాపారి ఇంటికి వెళ్తుండగా ఒక అల్లరిమూక అతడిపై దాడి చేసి, కొట్టి, పదునైన ఆయుధాలతో హింసింసింది. అనంతరం నిప్పుపెట్టడంతో దాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల నుంచి తప్పించుకునేందుకు దాస్ తీవ్రంగా ప్రయత్నం చేశాడు. తొలుత ప్రాణాలు రక్షించుకునేందుకు దగ్గర్లోని చెరువులో దూకాడు. ఈలోగా స్థానికులు వచ్చి అతన్ని మూక బారి నుంచి రక్షించారు.

అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే అతనికి చికిత్స అందిస్తున్న వైద్యులు మాత్రం దాస్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కొంత కాలంగా బంగ్లాదేశ్‌లో హిందూ వ్యతిరేక ముఠా ఆగడాలకు అడ్డూ ఆపు లేకుండా పోతోంది. 15 రోజుల వ్యవధిలో హిందువులపై జరిగిన నాల్గో ఘటన ఇది. డిసెంబర్ 19న మైమెన్ సింగ్ లోని భలుకా సబ్ జిల్లాలోని గార్మెంట్ ఫ్యాక్టరీలో ఒక ముస్లిం సహోద్యోగి తప్పుడు దైవదూషణ ఆరోపణ చేయడంతో 25 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ పై మూక దాడి చేసి దారుణంగా చంపారు. ఆపై అతడి మృతదేహాన్ని చెట్టుకు వేలాడిదీసి తగులపెట్టారు.డిసెంబర్ 24న బంగ్లాదేశ్ లోని కలిమోహర్ యూనియన్ లోని హొస్పెందంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే మరో యువకుడిపై రెచ్చిపోయిన గుంపు దాడి చేసి కొట్టి చంపివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. నిన్నకాక మొన్న గార్మెంట్ ఫ్యాక్టరీలో హిందూ యువకుడిని, తోటి సెక్యూరిటీ గార్డ్ కాల్చి చంపాడు. తాజాగా దాస్ ఘటన చోటుచేసుకుంది.