Reading Time: 2 minutes

కులం లేదు.. మతం లేదు.. నటుడు పార్థిబన్‌ కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!

Caption of Image.

ప్రముఖ నటుడు , దర్శకుడు ఆర్. పార్థిబన్ ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. దళపతి విజయ్ తో  త్రిషకు రూమర్ల నేపథ్యంలో ఆమె కొద్ది రోజులు ఇంట్లో కూర్చుంటే మంచిది అంటూ వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం రేగింది. దీంతో త్రిష ఆయన వ్యాఖ్యలను మూర్ఖత్వం అని కొట్టిపారేయగా.. పార్థిబన్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు. అయితే ఇప్పుడు  తన కుల, మత గుర్తింపులను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారారు. దీనిని విచారించిన న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.

కోర్టు మెట్లెక్కిన నటుడు

పార్థిబన్ మార్చి 20న షోలింగనల్లూర్ తహసీల్దార్‌కు తన కుల, మత గుర్తింపులను తొలగించమని దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అధికారులు ఈ దరఖాస్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ( ఏప్రిల్ 20, 2026 ) ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎం. దండపాణి కీలక తీర్పును ఇచ్చారు.  ఏప్రిల్ 29లోగా పార్థిబన్‌కు  ‘కులం లేదు, మతం లేదు’ (No Caste, No Religion) అనే సర్టిఫికేట్‌ను జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

పాత గుర్తింపులకు స్వస్తి

పార్థిబన్ తన పిటిషన్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన తన 11వ తరగతి చదువును మధ్యలోనే ఆపేయడం వల్ల, మతం , కులాన్ని సూచించే ఎలాంటి ధృవీకరణ పత్రాలు ఆయన వద్ద లేవు. ఆయన తల్లిదండ్రులు హిందూ గవర (BC) సామాజిక వర్గానికి చెందిన వారైనప్పటికీ, తాను మేజర్ అయ్యాక ఆ గుర్తింపులను స్వచ్ఛందంగా వదులుకున్నట్లు పేర్కొన్నారు. ఒక నటుడిగా, దర్శకుడిగా నా సినిమాల ద్వారా కులమతాలు లేని సమాజాన్ని నేను ఎప్పుడూ ఆకాంక్షిస్తాను అని ఆయన వివరించారు.

పిల్లల విషయంలోనూ అదే స్వేచ్ఛ

తన పిల్లలకు చదువు, అడ్మిషన్ల కోసం అప్పట్లో కుల ధృవీకరణ పత్రాలు తీసుకున్న విషయాన్ని పార్థిబన్ నిజాయితీగా అంగీకరించారు. అయితే, ఇప్పుడు వారు కూడా మేజర్లు అయ్యారని, తమ మతాన్ని,  కులాన్ని వదులుకునే హక్కు వారికి కూడా ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. కుల వ్యవస్థ అనేది కేవలం హిందూ మతంలోనే ఉందని, క్రైస్తవ, ఇస్లాం, బౌద్ధ, సిక్కు మతాల్లో ఇది కనిపించదని ఆయన తన వాదనలో పేర్కొన్నారు.

అసమానతలు లేకుండా..

గతంలో 2025 జూన్ 10న మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును పార్థిబన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కులం లేదు, మతం లేదు అని కోరుకునే పౌరుల దరఖాస్తులను సానుకూలంగా పరిశీలించాలని అప్పట్లో కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. పార్థిబన్ తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చట్టబద్ధంగా కులమతాలను వదులుకోవడం అనేది ఒక వ్యక్తిగత హక్కు అని, దీని ద్వారా సమాజంలో అసమానతలు తగ్గుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.