Reading Time: 2 minutes

వేదికపైనే వెక్కి వెక్కి ఏడ్చిన జెనీలియా.. ‘రాజా శివాజీ’ ట్రైలర్ ఈవెంట్‌లో రితేష్ ఎమోషనల్!

Caption of Image.

సినిమా అంటే కేవలం రెండున్నర గంటల వినోదం కాదు, వేల మంది కలల సమాహారం. ఒక కథను వెండితెరపైకి తీసుకురావడానికి నిర్మాత తన ఆస్తిని మాత్రమే కాదు, ఆయుష్షును కూడా పణంగా పెడతాడు. ఎండనక, వాననక రేయింబవళ్లు శ్రమించే కార్మికుల చెమట చుక్కలు, నటీనటుల భావోద్వేగాలు, దర్శకుడి తపన అన్నీ కలిస్తేనే ఒక అద్భుతం ఆవిష్కృతమవుతుంది.

 సినిమా వ్యాపారం కాదు.. ఒక ప్రాణం 

తన బిడ్డను జాగ్రత్తగా పెంచి పెద్ద చేసే తల్లిలాగే, ప్రతి నిర్మాత తన సినిమాను గుండెల్లో దాచుకుంటాడు. అది థియేటర్‌లో విడుదలయ్యే వరకు ప్రతి నిమిషం ఒక అగ్నిపరీక్షే. ఆ తెర వెనుక ఎన్ని కన్నీళ్లు, ఎన్ని నిద్రలేని రాత్రులు ఉంటాయో తెలియని కాదు. అందుకే సినిమా కేవలం ఒక వ్యాపారం కాదు, అది ఒక ప్రాణం లాంటిది. దాన్ని కాపాడుకోవడానికి పడే తపన అంతా ఇంతా కాదు..

 ‘రాజా శివాజీ’ ట్రైలర్ లాంచ్ 

అంతే కాదు సినిమా రంగంలో కొన్ని క్షణాలు కేవలం ప్రచారానికే పరిమితం కావు, అవి నటీనటుల జీవితకాల శ్రమకు నిదర్శనంగా నిలుస్తాయి. సరిగ్గా అలాంటి అరుదైన, అత్యంత భావోద్వేగపూరితమైన సన్నివేశం ముంబయిలో జరిగిన ‘రాజా శివాజీ’ హిందీ ట్రైలర్ లాంచ్ వేదికపై ఆవిష్కృతమైంది. మరాఠా వీర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించాలన్నది నటుడు రితేష్ దేశ్‌ముఖ్ దశాబ్దాల కల. ఆ కల సాకారమవుతున్న వేళ, వేదికపై రితేష్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయారు.

తండ్రిని తలచుకుని ఎమోషనల్

ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, శివాజీ మహారాజ్ పాత్రలో స్వయంగా నటించిన రితేష్.. ట్రైలర్ విడుదలయ్యాక ప్రసంగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రయాణం వెనుక ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఉంది. ప్రతి క్షణం నా తండ్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆశీస్సులు నాపై ఉన్నాయని నమ్ముతాను అని చెబుతూ భావోద్వేగానికి లోనైయ్యారు. తన తండ్రికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు పేర్కొంటూ రితేష్ ఎమోషనల్ అయ్యారు.

వెక్కి వెక్కి ఏడ్చేసిన జెనీలియా..

భర్త పడుతున్న ఆవేదనను, ఆనందాన్ని దగ్గరుండి చూసిన జెనీలియా దేశ్‌ముఖ్ సైతం ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. వేదికపై రితేష్ పక్కనే ఉన్న ఆమె, కన్నీళ్లు ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఒక భార్యగా రితేష్ ఈ సినిమా కోసం పడ్డ కష్టాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ ఆమె కళ్లలో నీళ్లు తిరగడం చూసి అక్కడ ఉన్న అతిథులు సైతం కదిలిపోయారు. సభా ప్రాంగణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

 

స్టార్స్ మెచ్చిన హిస్టారికల్ మూవీ

ఈవెంట్‌కు ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ దిగ్గజాలు సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్ వంటి వారు హాజరైయ్యారు.  చిత్ర బృందాన్ని అభినందించారు. ముఖ్యంగా ఇందులో సల్మాన్ ఖాన్ ‘జీవ మహాల’ అనే కీలక పాత్రలో మెరవడం విశేషం. ట్రైలర్‌లో విజువల్స్, అంకిత్ మీనన్ సంగీతం రోమాంచితంగా ఉన్నాయి. మరాఠీ, హిందీ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కేవలం ఒక సినిమాగా కాకుండా, ఒక వీరుడి చరిత్రకు నివాళిగా మలుస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 

©️ VIL Media Pvt Ltd.