
ఈ విషయం వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. నమ్మకమే పునాదిగా సాగే బంధాల్లో ఎంతటి కిరాతకం దాగి ఉందో తెలియజేస్తూ CNN తాజాగా ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఈ మాయాలోకంలో తెరవెనుక ఎలాంటి పనులు జరుగుతున్నాయ్, అవి అసలు ఏ స్థాయిలో విస్తరించాయ్ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నమ్మినవాడే నరరూప రాక్షసుడు:
మనం బయట తిరిగేటప్పుడు గుర్తుతెలియని వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ పక్కనే పడుకునే భర్త లేదా ప్రేమించిన వాడే ప్రాణంతక శత్రువుగా మారితే? అవును ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ రేప్ అకాడమీలు అనే పేరుతో డిజిటల్ మాఫియా నడుస్తోంది. టెలిగ్రామ్, మదర్‌లెస్ వంటి వెబ్‌సైట్లలో లక్షలాది మంది పురుషులు గ్రూపులుగా ఏర్పడి.. తమ సొంత భార్యలకు, ప్రియురాలికి మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడి ఎలా చేయాలి. ఆ సమయంలో వీడియోలు ఎలా తీయాలి అనే దానిపై శిక్షణ తీసుకుంటున్నారనే విషయం బయటపడింది. ఇది ఒక భయంకరమైన నెట్‌వర్క్‌గా మారి కోట్ల మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది.
మదర్‌లెస్ వెబ్‌సైట్ ఘోరాలు..
మదర్‌లెస్ అనే ఒక వెబ్‌సైట్‌కు ఫిబ్రవరి ఒక్క నెలలోనే 6కోట్ల 20లక్షల మంది విజిటర్స్ వచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మహిళలు స్పృహ లేకుండా ఉన్న వీడియోలను షేర్ చేస్తూ.. వారి కనురెప్పలు పైకి లేపి ఐ-చెక్ చేస్తూ వికృతానందం పొందుతున్నారు. అంటే సదరు మహిళ మత్తులో ఉందా లేదా అని నిర్ధారించుకోవడం అన్నమాట. మరికొన్ని చోట్ల క్రిప్టోకరెన్సీ తీసుకుని లైవ్ స్ట్రీమింగ్‌లు కూడా చేస్తున్నారు. భార్యకు ఇచ్చే మత్తుమందులు ఎక్కడ దొరుకుతాయి. వాటిని ఆహారంలో ఎలా కలపాలి అనే విషయాన్ని స్టెప్-బై-స్టెప్ నేర్పిస్తున్నారు ఆ వీడియోల్లో.
►ALSO READ | తెల్లారితే ప్రధాని మోడీ చేతుల మీదుగా ఓపెనింగ్.. ఇంతలోనే ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం
నమ్మకానికి వెన్నుపోటు..
ఈ అమానుషానికి బలైపోయిన జోయి వాట్స్ అనే మహిళ కథ వింటే కన్నీళ్లు రాక మానవు. 16 ఏళ్ల తన వైవాహిక జీవితంలో భర్తను దైవంగా భావించింది. కానీ అతను తన కొడుకు నిద్ర మాత్రలను ఆమె టీలో కలిపి, ఆమె స్పృహ కోల్పోయాక దారుణంగా అత్యాచారం చేసేవాడు. ఒక ఆదివారం భర్త తాను చేసిన ఈ దారుణాన్ని ఒప్పుకున్నాడు. మనకు బయట తిరిగేటప్పుడు వెనుక ఎవరు వస్తున్నారో అని భయం ఉంటుంది. అయితే పక్కన పడుకున్న వ్యక్తి కూడా ఒక మృగమని ఎవరూ ఊహించలేరంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
బీ అలర్ట్ మహిళలు..
గతంలో డొమినిక్ పెలికాట్ అనే వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి 70 మందికి పైగా అపరిచితులతో ఆమెపై అత్యాచారం చేయించిన ఘటన ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు ఇలాంటి నెట్‌వర్క్‌లు మరింత పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి నేరాలు మన ఇళ్లలోకి సైతం చొరబడుతున్నాయి. ఆడవారు తమ భాగస్వాముల ప్రవర్తనలో ఏ చిన్న తేడా ఉన్నా.. విపరీతమైన నీరసం లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోతున్నా అప్రమత్తంగా ఉండటం అవసరం.