
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియపై సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
రెండేళ్ల సర్వీసు పూర్తికాని వారికి నో
రెండేళ్ల సర్వీసు కూడా పూర్తికాని ఉద్యోగులను ఈ దఫా బదిలీ చేయరాదని, ఒకే కేడర్‌లో గరిష్టంగా 40 శాతానికి మించి బదిలీలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. మానవీయ కోణంలో పలు కేటగిరీలకు ఈ బదిలీల్లో పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా స్పౌజ్ కేటగిరి, వితంతువులు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక సమస్యలున్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత కల్పించనున్నారు.
అలాగే క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ లేదా లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వారి నివాస ప్రాంతాలకు దగ్గరగా పోస్టింగ్ ఇచ్చేలా నిబంధనలు ఉండనున్నాయి. కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆదేశాల ప్రకారం 2027 వరకు బదిలీలపై ఆంక్షలు ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధమైన విధులకు ఆటంకం కలగకుండా రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా కుటుంబ వివరాల నమోదు, ఇంటింటికీ వెళ్లి సమాచార సేకరణ వంటి కీలక బాధ్యతలు ఉన్నందున, బదిలీ అయిన ఉద్యోగులు ఆయా జిల్లాల్లోనే తమ విధులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.