Reading Time: < 1 minute

ఇవాళ(ఏప్రిల్20) జగిత్యాలలో బీఆర్ఎస్ సభ..హాజరుకానున్న కేసీఆర్

Caption of Image.
  •    హాజరుకానున్న పార్టీ అధినేత కేసీఆర్‌‌
  •     గులాబీ పార్టీలో చేరనున్న జీవన్‌రెడ్డి 
  •     సభ ఏర్పాట్లను పరిశీలించిన తలసాని

జగిత్యాల/ జగిత్యాల టౌన్,​ వెలుగు: జగిత్యాలలో సోమవారం బీఆర్‌‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. దీనికి మాజీ సీఎం, బీఆర్‌‌ఎస్ అధినేత కేసీఆర్‌‌ హాజరుకానున్నారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్​లో చేరనున్నారు.  ఈ సభ కోసం జగిత్యాల చుట్టూ ఐదు నియోజకవర్గాలకు పార్టీ హైకమాండ్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌చార్జిలుగా నియమించి జన సమీకరణ, సభ ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం జగిత్యాలలో పర్యటించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ వసంత ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరంతా సభా ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తలసాని స్థానిక నాయకులకు సూచించారు. సుమారు లక్ష మంది హాజరయ్యే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ బహిరంగ సభ నేపథ్యంలో జగిత్యాల పట్టణం గులాబీ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో సాయంత్రం 4.30 గంటల సమయంలో జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు బహిరంగ సభకు హాజరుకానున్నారు.

ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్​ శ్రేణులు

జగిత్యాల ఓల్డ్ బస్టాండ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ జెండాల కోసం జీవన్ రెడ్డి నివాసానికి వెళ్తే జెండాలు ఇవ్వలేదని కార్యకర్తలు ఆగ్రహానికి లోనరయ్యారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన జీవన్ రెడ్డి, కేసీఆర్ ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు చింపేశారు. ఫ్లెక్సీలు చింపడాన్ని నిరసిస్తూ జీవన్ రెడ్డి అభిమానులు ఘటనాస్థలంలోనే ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
 

©️ VIL Media Pvt Ltd.