Reading Time: 2 minutes

బ్యాంకు ఆఫీసర్లే సైబర్ దొంగలు..దేశవ్యాప్తంగా భారీ సైబర్ స్కామ్ గుట్టు రట్టు

Caption of Image.
  •     దేశవ్యాప్తంగా భారీ సైబర్  స్కామ్ గుట్టు రట్టు
  •     9 రాష్ట్రాల్లో 32 మంది ఆఫీసర్ల అరెస్ట్​ 
  •     మరో 20 మంది సైబర్​ క్రిమినల్స్​ అదుపులోకి
  •     డిజిటల్​ అరెస్ట్​, మనీ లాండరింగ్​తో 150 కోట్లు దోపిడీ
  •     850 కేసులతో సంబంధం ఉందని గుర్తింపు 

బషీర్​బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్  మోసాల నెట్​వర్క్​ను హైదరాబాద్  పోలీసులు ఛేదించారు. బ్యాంకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్  ఆక్టోపస్- 2.0 పేరిట నిర్వహించిన ఈ స్పెషల్​ ఆపరేషన్​లో 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు చేసి 52 మందిని అరెస్టు చేశారు. అయితే, కంచే చేను మేసినట్టు 32 మంది బ్యాంకు అధికారులు సైబర్​ నేరాలకు సహకరిస్తున్నట్టు గుర్తించారు. మిగిలిన వారిలో సైబర్​ క్రిమినల్స్​తో పాటు 15 మంది మ్యూల్ అకౌంట్​ హోల్డర్స్, ఐదుగురు మీడియేటర్లు​ఉన్నారు. వీరంతా కలిసి దేశవ్యాప్తంగా 850 కేసుల్లో రూ.150 కోట్లు కొల్లగొట్టినట్టు గుర్తించారు.  

ఎలా చేస్తున్నారంటే..

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్​ సిటీ సైబర్​ క్రైం​పోలీసుల ఆధ్వర్యంలో ఆపరేషన్  ఆక్టోపస్ -1 నిర్వహించారు.  ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 32 స్పెషల్​టీమ్స్​ సోదాలు చేసి 117 మందిని అరెస్టు చేశాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఈ సందర్భంగా పట్టుకున్న నిందితుల్లో మ్యూల్  అకౌంట్​ హోల్డర్స్, ఎకౌంట్స్​ ఇచ్చేవాళ్లతో పాటు పలువురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా రూ.150 కోట్ల మేర లావాదేవీలు జరిపిందని, 850 కేసులతో సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. నిందితుల నుంచి రూ.36 లక్షల నగదుతో పాటు 204 మొబైల్ ఫోన్లు, 141 సిమ్ కార్డులు, 152 బ్యాంక్  పాస్‌‌బుక్‌‌లు, 234 డెబిట్  కార్డులు, 26 ల్యాప్‌‌టాప్‌‌లను స్వాధీనం చేసుకున్నారు.

బ్యాంకు అధికారులు ఉండడంతో

సైబర్​ ఫ్రాడ్స్​లో బ్యాంకు అధికారుల పాత్ర  ఉండడంతో అలాంటి వారే లక్ష్యంగా ఆపరేషన్  ఆక్టోపస్- 2.0 నిర్వహించారు. హైదరాబాద్  సైబర్  క్రైం డీసీపీ వి.అరవింద్ బాబు నేతృత్వంలో 16 స్పెషల్​ టీమ్స్​ ఏడు రోజుల పాటు మన రాష్ట్రంతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లో దాడులు నిర్వహించి నెట్​వర్క్​ను ఛేదించారు. ఇందులో 32 మంది బ్యాంకు అధికారులు కేవైసీ రూల్స్​ బ్రేక్​ చేసి నేరగాళ్లకు మ్యూల్  ఖాతాలను తెరిచి ఇచ్చారని తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ ఇండ్, బంధన్, బ్యాంక్  ఆఫ్  బరోడా వంటి ప్రముఖ బ్యాంకుల్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. నిందితులు దేశవ్యాప్తంగా 350 బ్యాంకు ఖాతాలను వినియోగించారని, వీరికి 850 సైబర్  కేసులతో సంబంధం ఉందని గుర్తించారు. వీటి ద్వారా దాదాపు రూ.150 కోట్ల మేర మోసాలు చేశారని బయటపెట్టారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 14 చెక్​బుక్స్​, రెండు పెన్ డ్రైవ్స్, ల్యాప్‌‌టాప్‌‌, 21 షెల్  కంపెనీల స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.
 

©️ VIL Media Pvt Ltd.