
‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందుతున్న రెండో చిత్రం ‘మహావతార్ పరశురామ్’ (Mahavatar Parshuram). కన్నడ బడా బ్యానర్ నిర్మిస్తున్న ఈ యానిమేషన్ మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. పరశురామ జయంతి సందర్భంగా (ఏప్రిల్ 19, 2026న) ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయడం విశేషం.
దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందిస్తున్న ‘మహావతార్ పరశురామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలు పెంచింది. యుద్ధభూమిలో రక్తంతో తడిసిన గొడ్డలిని పట్టుకున్న భీకర యోధుడిగా పరశురాముడు కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌కు హోంబలే ఫిల్మ్స్ క్యాప్షన్‌గా, “లోకంలో ధర్మం నశించినప్పుడు, అధర్మాన్ని ఎదుర్కొనే శక్తిగా పరశురాముడు సమతుల్యతను తిరిగి స్థాపిస్తాడు” అని పేర్కొంది. ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో విడుదల కానుంది.
మహావతార్ పరశురామ్ రిలీజ్ తర్వాత, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాధీష్, 2033లో మహావతార్ గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు రానున్నాయి.
‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha):
2025లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కన్నడ యానిమేషన్ మూవీ ‘మహావతార్ నరసింహ’. ఈ మైథాలజీ సినిమా వరల్డ్‌వైడ్‌గా మంచి విజయాన్ని అందుకుంది. రూ.40 కోట్లతో రూపొందించగా, రూ.300 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్‌లోనూ రికార్డు వ్యూస్‌తో సత్తా చాటింది.
మహా విష్ణువు నాలుగో అవతారమైన నరసింహుడి ఉగ్రరూపాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. భక్త ప్రహ్లాదున్ని అతని తండ్రి, రాక్షసుడైన హిరణ్య కశిపుడి నుంచి కాపాడటానికి స్తంభాన్ని చీల్చుకొని వచ్చే నరసింహుడిని యానిమేషన్ రూపంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.