Reading Time: 2 minutes

పిల్లల స్కిల్స్‌‌ పెంచే  టాయ్ ట్రంక్..! చిన్నారుల ఊహకు తగ్గట్టుగా…

Caption of Image.

సాధారణంగా ఆర్కిటెక్టులు పెద్ద పెద్ద అపార్ట్‌‌మెంట్లు, ఇండ్లు, ఆఫీసులను డిజైన్ చేస్తారు. కానీ, ప్రియాంక వాయుదే, అజయ్ వైద్య దంపతులు మాత్రం పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే బొమ్మలను తయారుచేస్తున్నారు. అందుకోసం ‘టాయ్ ట్రంక్’ అనే వినూత్న స్టార్టప్​ను స్థాపించారు. దాని ద్వారా పర్యావరణహితమైన, పిల్లల్లో స్కిల్స్‌‌ని పెంచే బొమ్మలను అందిస్తున్నారు. అంతేకాదు.. ఈ స్టార్టప్‌‌ ద్వారా ఎంతోమంది కళాకారులకు ఉపాధిని కూడా ఇస్తున్నారు. 

పుణెకు చెందిన ప్రియాంక ఆర్కిటెక్ట్‌‌గా, ఇంటీరియర్ డిజైనర్‌‌గా పని చేస్తూ క్రాఫ్ట్, టెక్నాలజీలో పట్టు సాధించింది. ఆమె భర్త అజయ్ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్.  ఇద్దరూ చాలాకాలంపాటు నిర్మాణ రంగంలో పనిచేశారు. ప్రియాంక తల్లి అయ్యాక ఒకసారి తన బిడ్డ కోసం బొమ్మలు కొనడానికి మార్కెట్‌‌కి వెళ్లింది. అక్కడ బొమ్మలను గమనించినప్పుడు ఏదో లోటు ఉన్నట్టు అనిపించింది. 

ఎక్కువ బొమ్మలు ప్లాస్టిక్‌‌తో తయారైనవి, మితిమీరిన శబ్దాలు చేసేవి లేదా పిల్లల క్రియేటివిటీని దెబ్బతీసేలా ఉన్నాయి. ‘‘ఆర్కిటెక్చర్‌‌లో మేము స్పేస్‌‌ని ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తాం. అంటే ఎక్కడ ఖాళీ ప్లేస్‌‌ ఉన్నా దాన్ని ఎలాంటి వస్తువులతో నింపాలి అనేది ఆలోచిస్తుంటాం. అదే సూత్రాన్ని అప్లై చేసి పిల్లల్లో ఆలోచనలు పెంచే బొమ్మలు ఎందుకు తయారుచేయకూడదు?” అనే ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నే ఆమె స్టార్టప్ ప్రయాణానికి పునాది వేసింది.

లాక్‌‌డౌన్‌‌లో.. 

2020లో ప్రపంచం లాక్‌‌డౌన్‌‌లో ఉన్నప్పుడు పిల్లలు గంటల తరబడి స్క్రీన్ల(మొబైల్, టీవీ)కు అతుక్కుపోవడం ప్రియాంక, అజయ్‌‌ గమనించారు. అలాంటి పిల్లల్లో బొమ్మల ద్వారా మోటార్ స్కిల్స్ (చేతులు, కళ్ల సమన్వయం), కాగ్నిటివ్ డెవలప్‌‌మెంట్ (మేధో వికాసం) పెంచవచ్చని వాళ్లకు అనిపించింది.‘‘ పిల్లలు బాల్యంలో పొందే అనుభవాలు వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి.  రోజువారీ ఒత్తిళ్లు, సవాళ్లకు ప్రతిస్పందించే తీరును మెరుగుపరుస్తాయి. ఇతరులతో కలిసిమెలిసి ఉండే తత్వాన్ని డెవలప్‌‌ చేస్తాయి.

 అంటే బొమ్మలు పిల్లల సంపూర్ణ వికాసానికి ఉపయోగపడతాయి. ఈ విషయంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో  ఈ దంపతులు టాయ్ ట్రంక్​ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా స్కిల్స్‌‌ పెంచే చెక్క బొమ్మలు తయారుచేసి మార్కెట్‌‌లో అమ్ముతున్నారు.  ముఖ్యంగా వీళ్లు రూపొందించిన కాన్సెంట్రిక్ సర్కిల్స్, స్టాకింగ్ టాయ్స్, జిగ్సా పజిల్స్ లాంటివి పిల్లల్లో ఏకాగ్రతను, సమస్య పరిష్కార సామర్థ్యాన్ని పెంచుతాయని ఎక్స్‌‌పర్ట్స్‌‌ కూడా అంటున్నారు. టాయ్ ట్రంక్ బొమ్మలను 0 నుంచి 8 ఏళ్ల వయసున్న పిల్లల కోసం తయారుచేస్తారు. చేతితోనే.. 

టాయ్‌‌ ట్రంక్‌‌లో తయారయ్యే బొమ్మలన్నీ చేతితో తయారుచేసినవే. ముందుగా చెక్కలను మెషీన్‌‌తో కోస్తారు. అంచులకు ఆకారం ఇవ్వడం, రంగులు వేయడం, డీటెయిల్స్‌‌ యాడ్‌‌ చేయడం, అసెంబ్లింగ్ లాంటివన్నీ చేతితోనే చేస్తారు. పైగా బొమ్మల తయారీలో సాధారణ కలపకు బదులుగా హానికర రసాయనాలు లేని, పిల్లలకు సురక్షితమైన ‘స్టీమ్డ్ బీచ్ వుడ్’ని మాత్రమే వాడతారు. అలాగే, సహజసిద్ధమైన లాక్ లేదా వాటర్‌‌‌‌ బేస్డ్‌‌ రంగులను మాత్రమే బొమ్మలకు వేస్తారు. ఈ స్టార్టప్ కేవలం ఒక వ్యాపారాన్ని పెంచుకునేందుకే కాకుండా సామాజిక బాధ్యతతో పనిచేస్తోంది. చన్నపట్న (కర్ణాటక)తోపాటు ఎన్నో ప్రాంతాల్లోని బొమ్మల తయారీ కళాకారులను ఈ దంపతులు ఏకం చేశారు. వాళ్లకు ఆధునిక డిజైన్లు నేర్పించి, వాళ్ల ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో బొమ్మలను తయారుచేయిస్తున్నారు. దీనివల్ల వందలాది మంది కళాకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతోంది. 

ఎన్నో సవాళ్లు

మంచి జీతం వచ్చే ఉద్యోగాలను వదిలి స్టార్టప్ పెట్టడం అనేది ఎవరికైనా పెద్ద సాహసమే. అలాంటి సాహసం చేయడం వల్లే అజయ్‌‌, ప్రియాంక సక్సెస్‌‌ అయ్యారు. మొదట్లో సరైన ముడిసరుకు సేకరణ, లాజిస్టిక్స్ ఇబ్బందులు ఎదురయ్యాయి. పైగా తక్కువ ధరకు దొరుకుతుండడంతో తల్లిదండ్రులు ప్లాస్టిక్ బొమ్మల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దాంతో చెక్క బొమ్మలకు పెద్దగా గిరాకీ ఉండేది కాదు. ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కానీ.. ప్రొడక్ట్స్‌‌ క్వాలిటీ, డిజైన్‌‌లో ప్రత్యేకత వల్ల తక్కువ కాలంలోనే ‘టాయ్ ట్రంక్’ పెద్ద బ్రాండ్‌‌గా ఎదిగింది. ప్రముఖ ఈ–కామర్స్ ఫ్లాట్‌‌ఫామ్స్‌‌లో, వాళ్ల సొంత వెబ్‌‌సైట్ ద్వారా వేలాది మంది కస్టమర్లను సంపాదించుకున్నారు. ముఖ్యంగా మోంటెస్సోరి పద్ధతిలో పిల్లలను పెంచాలనుకునే తల్లిదండ్రులకు ‘టాయ్ ట్రంక్’ ఫస్ట్‌‌ చాయిస్‌‌గా మారింది.

భవిష్యత్తు ప్రణాళికలు 

ప్రియాంక, అజయ్ కేవలం బొమ్మలకే పరిమితం కాకుండా భవిష్యత్తులో ‘కిడ్స్ ఇంటీరియర్స్’ (పిల్లల గదుల డిజైనింగ్​) రంగంలోకి కూడా అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పిల్లలు పెరిగే వాతావరణం కూడా వాళ్ల ఆలోచనా తీరును ప్రభావితం చేస్తుందని, అందుకే పిల్లల కోసం ప్రత్యేకమైన ‘లెర్నింగ్ స్పేసెస్’ డిజైన్ చేయడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. అంతేకాకుండా మన దేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి ఎలాంటి హాని చేయని బొమ్మలను ఎగుమతి చేసే అతిపెద్ద సంస్థగా ‘టాయ్ ట్రంక్’ను నిలబెట్టాలనేది వాళ్ల ఆశయం. ‘‘మేము కేవలం బొమ్మలను అమ్మడం లేదు. పిల్లల చిన్ననాటి జ్ఞాపకాలను ఆరోగ్యకరంగా మారుస్తున్నాం” అని ప్రియాంక గర్వంగా చెప్తుంటారు. 

టాయ్‌‌ ట్రంక్ లక్ష్యాలేంటి? 

  • పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ బొమ్మల స్థానంలో సహజమైన కలప బొమ్మలు వాడేలా చేయడం. 
  • బొమ్మలు ఒకే రకంగా కాకుండా, పిల్లలు తమ ఊహకు తగ్గట్టుగా రకరకాలుగా మలుచుకునేలా తయారుచేయడం. 
  • విదేశీ బొమ్మల దిగుమతిని తగ్గించి, భారతీయ హస్తకళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడం.
©️ VIL Media Pvt Ltd.