Reading Time: 2 minutes

ప్రతి నెల రూ.9 వేలు వడ్డీ ఆదాయం కావాలా.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెస్ట్

Caption of Image.

భారత స్టాక్ మార్కెట్ అస్థిరతలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్న వేళ.. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ మార్గాల కోసం వెతుకులాట పెరిగింది. ఇలాంటి తరుణంలో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. మీ పెట్టుబడికి పూర్తి భద్రత కల్పిస్తూనే.. ప్రతి నెలా ఆదాయాన్ని అందించడం ఈ స్కీమ్ ప్రత్యేకత. ముఖ్యంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు.. స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఇది ఒక వరంలాంటిది పెట్టుబడి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్చి 30, 2026న వడ్డీ రేట్లను ప్రకటించింది. ఈ పథకంపై వడ్డీ రేటును 7.4 శాతంగా మార్పులు లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2023 నుండి ఈ రేటులో ఎలాంటి మార్పు లేదు. మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నప్పటికీ.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పై స్థిరమైన రాబడిని అందించడం ద్వారా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని ప్రభుత్వం నిలబెట్టుకుంటోంది.

పెట్టుబడి పరిమితుల విషయానికి వస్తే.. ఈ పథకంలో సింగిల్ పర్సన్ అకౌంట్ ద్వారా గరిష్టంగా రూ.9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ జాయింట్ అకౌంట్ తెరిస్తే.. ఈ పరిమితి రూ.15 లక్షల వరకు ఉంటుంది. జాయింట్ అకౌంట్లో ముగ్గురు పెద్దల వరకు సభ్యులుగా ఉండవచ్చు. ఒకవేళ మీరు రూ.9 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రస్తుత 7.4 శాతం వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.5,550 ఆదాయం వస్తుంది. అదే రూ.15 లక్షల పెట్టుబడిపై నెలకు సుమారు రూ.9,250 వరకు రాబడి పొందే అవకాశం ఉంది. 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ పథకంలో ఒకేసారి లంప్ సమ్ మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

ఈ ఖాతాను ఏ పోస్టాఫీసులోనైనా సులభంగా తెరవవచ్చు. కేవలం పెద్దలే కాకుండా.. 10 ఏళ్లు పైబడిన మైనర్లు తమ పేరు మీద ఖాతా ప్రారంభించవచ్చు. అలాగే మానసిక వికలాంగుల తరపున లేదా మైనర్ల తరపున గార్డియన్స్ కూడా అకౌంట్ నిర్వహించవచ్చు. సేఫ్ రిటర్న్స్, ప్రభుత్వ గ్యారెంటీ, క్రమబద్ధమైన నెలవారీ ఆదాయం కావాలనుకునే వారికి పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ బెస్ట్ పెట్టుబడి సాధనంగా చెప్పుకోవచ్చు. 

©️ VIL Media Pvt Ltd.