Reading Time: 2 minutes

ఒక్క గంటలోనే 7 సార్లు అబద్దాలు చెప్పిన ట్రంప్.. అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇరాన్

Caption of Image.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుస ప్రకటనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ట్రంప్ ఒక్క గంటలోనే 7 అబద్ధాలు ఆడారని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ సీరియస్ అయ్యారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలకూ.. ట్రంప్ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న మాటలకు అస్సలు సంబంధం లేదని తేల్చేశారు గాలిబాఫ్. ఇలాంటి అబద్ధాల వల్ల అటు యుద్ధంలో గానీ.. ఇటు చర్చల్లో గానీ ఎలాంటి విజయం లభించదని హెచ్చరించారు. ఇరాన్ వర్గాల సమాచారంతో పాటుగా అంతర్జాతీయ మీడియా విశ్లేషణల ప్రకారం ట్రంప్ చెప్పిన అబద్ధాలు ఇవే.. 

1. హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంది: హోర్ముజ్ జలసంధి వ్యాపారం కోసం పూర్తిగా తెరవబడిందంటూ ట్రంప్ ప్రకటించారు. కానీ అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నందున అది తెరిచి లేదని.. తమ అనుమతి లేకుండా నౌకలు వెళ్లలేవని ఇరాన్ స్పష్టం చేసింది.

2. అణు కార్యక్రమం నిలిపివేత: ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయడానికి అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. దీనిని ఇరాన్ అధికారులు పూర్తిగా ఖండించారు.

3. న్యూక్లియర్ డస్ట్ అప్పగింత: ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించడానికి టెహ్రాన్ ఒప్పుకుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది పచ్చి అబద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది.

4. సముద్రంలో మైన్ల తొలగింపు: అమెరికా సహాయంతో ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లను తొలగిస్తోందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. అసలు తమ జలాల్లో అమెరికా ప్రమేయమే లేదని ఇరాన్ కౌంటర్ ఇచ్చింది.

5. చర్చల్లో అడ్డంకులు లేవు: ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో ఇప్పుడు ఎలాంటి చిక్కుముడులు, అడ్డంకులు లేవని.. ఒప్పందం దాదాపు ఖరారైందని ట్రంప్ చెప్పారు. కానీ కీలక అంశాలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందని ఇరాన్ క్లారిటీ ఇచ్చింది.

6. యుద్ధంలో విజయం: తాము ఈ యుద్ధంలో విజయం సాధించామని ట్రంప్ పరోక్షంగా చెప్పుకున్నారు. ఇలాంటి అబద్ధాలతో యుద్ధంలో గెలవలేరని ఇరాన్ నేత గాలిబాఫ్ ఎద్దేవా చేశారు.

7. ఇరాన్ చర్చల కోసం తహతహలాడుతోంది: ఇరాన్ స్వయంగా అమెరికాను కలవాలని.. డీల్ చేసుకోవాలని ఆరాటపడుతోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే తాము కేవలం గౌరవప్రదమైన నిబంధనలకే మొగ్గు చూపుతామని, ట్రంప్ చెప్పినట్లు లొంగిపోలేదని ఇరాన్ తేల్చి చెప్పింది. 

©️ VIL Media Pvt Ltd.