Reading Time: 2 minutes

తెలంగాణ గౌరవంపై రాజీపడం.. రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్‌‌తో పోల్చడంపై ఎంపీ వంశీకృష్ణ ఫైర్‌‌‌‌

Caption of Image.
  • తేజస్వి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌‌‌‌కు వినతి
  • వంశీ డ్రాప్ట్ చేసిన లేఖపై సంతకాలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఆత్మగౌరవంపై రాజీపడేది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరు వ్యాఖ్యలు చేసినా సహించేది లేదన్నారు. లోక్‌‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌‌తో పోల్చడంపై ఎంపీ ఫైర్ అయ్యారు. 

ఈ వ్యాఖ్యలను వెంటనే రికార్డులను నుంచి తొలగించాలని లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఈ లేఖపై రాష్ట్రానికి చెందిన 8 మంది ఎంపీలు సంతకాలు చేసి మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీలందరూ స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్‌‌‌‌లో కలిసి లేఖను అందేశారు.

ఈ సందర్బంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి వెంటనే తొలగించాలని కోరారు. అనంతరం ఎంపీ గడ్డం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ… తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, ఇలాంటి వ్యాఖ్యలు తగవని అంగీకరించినట్లు చెప్పారు. వాటిని రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. 

తెలంగాణ రాష్ట్రం అనేక బలిదానాలు, పోరాటాల ఫలితమని.. అలాంటి రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటం తమ బాధ్యత అని, రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీ వేదికగా ఎల్లప్పుడూ పోరాడుతామని పునరుద్ఘాటించారు.

కేవలం మహిళా బిల్లు పెడితే 100 శాతం మద్దతిస్తం..
మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా ప్రత్యేక బిల్లు పెడితే 100 శాతం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ప్రకారం వారికి మహిళలకు రక్షణ కల్పించే ఉద్దేశం లేదని స్పష్టమైందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో తెచ్చిన డీలిమిటేషన్ బిల్లు శుక్రవారం సభలో వీగిపోయిన తర్వాత.. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ నేతృత్వంలో మరోసారి రాజ్యాంగాన్ని నిలబెట్టామని పేర్కొన్నారు. 2023 మహిళా రిజర్వేషన్ బిల్లుకైతేనే తాము పూర్తిస్థాయి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం బీజేపీ బిల్లు పెట్టలేదని, అందుకే వీగిపోయిందని విమర్శించారు.

©️ VIL Media Pvt Ltd.