
న్యూఢిల్లీ: లోక్ సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై వాడీ వేడీగా జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సెటైర్లు వేశారు. ప్రియాంక, రాహుల్ సెటైర్లకు అమిత్ షాతో పాటు సభలోని సభ్యులంతా నవ్వారు. మరీ ప్రియాంక, రాహుల్ ఏమన్నారు..? సభలో ఎందుకు నవ్వులు పూశాయో తెలుకుందాం..
మొత్తం ప్లాన్ అమిత్ షాదే: ప్రియాంక
మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రెండు బిల్లులను ఒకదానికొకటి లింక్ చేయడం కేంద్ర మంత్రి అమిత్ షా ప్లానేనని అన్నారు. ప్రాచీన భారత బహుముఖ ప్రజ్ఞాశాలి చాణక్యుడు ఈ రోజు జీవించి ఉంటే అమిత్ షా రాజకీయ చతురత చూసి ఆశ్చర్యపోయేవారని చమత్కరించారు. ప్రియాంక వ్యాఖ్యలతో అమిత్ షాతో పాటు సభలోని సభ్యుల ముఖాల్లో చిరు నవ్వులు చిందించాయి.
మా సోదరి ఐదు నిమిషాల్లోనే చేసింది: రాహుల్
ప్రియాంక ప్రసంగం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నా 20 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చేయలేని పనిని.. ఐదు నిమిషాల్లోనే నా సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ సాధించారు. అదేంటి అంటే అమిత్ షాను నవ్వించటం అంటూ సభలో సరదాగా వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. అలాగే, ప్రధాని మోడీకి, తనకు భార్య సమస్య లేదంటూ చమత్కరించారు రాహుల్.
దీనికి సభలో నవ్వులే నవ్వులు. మిగతా అందరి సమస్యలు మాకు తెలుసు.. వారి నుంచి విన్నాం.. ప్రధాని మోడీకి, నాకు భార్య లేకపోవటం వల్ల మాకు భార్య సమస్యలు తెలియవు అంటూ నవ్వించారు రాహుల్ గాంధీ. మాకు భార్య నుంచి ఎలాంటి సలహాలు, సూచనలు అందవు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ.
మీ సోదరిని చూసి నేర్చుకో: అమిత్ షా
లోక్ సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులపై చర్చకు కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు అమిత్ షా. సభలో రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్న తీరు, అతడి భాష ఏ మాత్రం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని పట్టుకుని నువ్వు పిరికివాడివి, నువ్వు లొంగిపోతున్నావు, నువ్వు నాకు భయపడుతున్నావు.. ఇవేం మాటలు సభలో ఇలాగేనా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేదని మండిపడ్డారు.
రాహుల్ బాష సభ గౌరవాన్ని దెబ్బతీస్తుందని విమర్శించారు. మీ వ్యాఖ్యలను యావత్ దేశం వింటుందని.. మీ వ్యవహారశైలిని బట్టే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని అంచనా వేస్తారని చురకలంటించారు. భాష కేవలం భావోద్వేగాలను ప్రతిబింబించకూడదన్నారు. సభలో ఎలా మాట్లాడాలి.. ఎలా వ్యవహరించాలో మీ పార్టీ పెద్దలను చూసి నేర్చకోవాలని.. ఒకవేళ సీనియర్లు ఎవరూ లేకపోతే మీ సోదరి ప్రియాంక గాంధీని చూసైనా నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు.