Reading Time: 2 minutes

తల నొప్పిగా ఉంది: రాహుల్ ప్రసంగాన్ని ఎగతాళి చేసిన MP కంగనా

Caption of Image.

న్యూఢిల్లీ: లోక్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగంపై సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో రాహుల్ గాంధీ ప్రసంగం వినడం తలనొప్పిగా ఉందని ఎద్దేవా చేశారు. చివరకు స్పీకర్ కూడా ప్రసంగం ఆపాలని ఆయనను కోరారని ఎగతాళి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి రాహుల్ గాంధీ పార్లమెంటును అపహాస్యం చేశారని విమర్శించారు. అనవసరమైన అంశాలు లేవనెత్తుతూ రాహుల్ గాంధీ సభ సమయాన్ని వృధా చేస్తు్న్నారని మండిపడ్డారు. రాహుల్ స్పీచ్ తలనొప్పి అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గమంటున్నారు. పార్లమెంట్ అంటే సినిమాల్లో యాక్ట్ చేయడం కాదని.. అన్ని అంశాలు వినే ఓపిక ఉండాలని కౌంటర్ ఇస్తున్నారు. 

వాడీ వేడీ చర్చ

లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై అధికార ఎన్డీఏ, విపక్ష ఇండీ కూటమి మధ్య వాడీ వేడీగా చర్చ నడిచింది. రెండు రోజుల పాటు ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ మోడీ సర్కార్‎పై విరుకుచుకుపడ్డారు. మహిళ రిజర్వేషన్ల సాకుతో డీలిమిటేషన్ చేసి భారత దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మహిళా బిల్లు కాదు.. యాంటి నేషనల్ బిల్లు

ఈ బిల్లు మహిళా సాధికారత కోసం తీసుకొచ్చిన బిల్లు కాదని.. యాంటీ నేషనల్ యాక్ట్ బిల్లు అని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2023లో లోక్ సభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు అసలైనదన్నారు. మూడు బిల్లులను కలిపి తీసుకురావడం సిగ్గుచేటన్నారు. ఈ బిల్లులతో ఓబీసీ, మైనార్టీలను అణచివేసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని అన్నారు. 

రాజ్యాంగంపై మనువాదాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో సౌత్, నార్త్, చిన్న రాష్ట్రాలకు నష్టం జరగనివ్వమని అన్నారు. ఓట్లకోసం బీజేపీకి ఓబీసీ, ఆదివాసీలు ఎస్సీలు కావాలి.. ఎన్నికల జిమ్మిక్కు కోసమే మహిళా బిల్లును తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. రాజ్యాంగం కంటే మనువాదానికి బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు.

ఈ బిల్లులతో దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కులను లాక్కుంటున్నారని రాహుల్ మండిపడ్డారు. ఈ బిల్లులతో సెంట్రల్‎లో శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. మహిళా బిల్లుకు ప్రతి ఒక్క విపక్ష నేత మద్దతునిస్తారని.. 2023లో ఆమోదం పొందిన మహిళ బిల్లును వెంటనే అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

©️ VIL Media Pvt Ltd.