Reading Time: < 1 minute

వృద్ధుడిని 15 రోజులు బంధించి.. డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 42 లక్షలు దోపిడీ

Caption of Image.

డిజిటల్ అరెస్ట్ పేరుతో సాగుతున్న భారీ మోసాలకు సైబరాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి లక్షలు కొల్లగొడుతున్న అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక నిందితుడు గజర్ల అవినాష్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

 సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ చెప్పిన వివరాల ప్రకారం.. బాలానగర్‌కు చెందిన సదానందం అనే వృద్ధుడికి నిందితుడు అవినాష్ ఫోన్ చేశాడు. మీ మొబైల్ నెంబర్‌పై 17 కేసులు ఉన్నాయని, మీరు తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారని భయపెట్టాడు. సీనియర్ సిటిజన్ కావడంతో ఇంట్లోనే ఉంచి విచారణ చేస్తామని నమ్మించి.. ఏకంగా 15 రోజుల పాటు ఆ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్  చేశారు. వీడియో కాల్స్‌లో బెదిరిస్తూ సదానందం నుంచి  రూ. 42 లక్షల నాలుగు వేర్వేరు మ్యూల్ అకౌంట్లలోకి మళ్లించారు.

నిందితుడు అవినాష్ తొలుత డేటా ఎంట్రీ జాబ్ కోసం కంబోడియా వెళ్లాడు. అక్కడ భారతీయులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేసే ముఠాతో చేతులు కలిపాడు. ఆ తర్వాత తనే స్వయంగా కంబోడియా నుండే ఆపరేషన్ మొదలుపెట్టాడు. అయితే ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. ముందస్తుగా నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా అవినాష్ పేరు బయటపడింది. మార్చిలో ఇండియాకు వచ్చిన అవినాష్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

►ALSO READ | జనగామ జిల్లాలో దారుణం.. రెండో భార్యతో కలిసి బిస్కెట్లలో విషం పెట్టి.. కన్న కొడుకులను చంపాలని చూసిన తండ్రి !

నిందితుడి వద్ద నుంచి 12 లక్షల రూపాయలను రికవరీ చేశారు. డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితుడిని పట్టుకుని, నగదును సీజ్ చేయడం ఇదే మొదటిసారి అని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా  ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు.డిజిటల్ అరెస్ట్ అనే పద్ధతి చట్టంలో ఎక్కడా లేదని,ఎవరైనా పోలీస్ లేదా సీబీఐ అధికారులమని చెప్పి వీడియో కాల్‌లో భయపెడితే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

©️ VIL Media Pvt Ltd.