
- బల్దియాను ముట్టడించిన బీజేపీ కౌన్సిలర్లు
నిర్మల్, వెలుగు: నిర్మల్ పట్టణంలో అభివృద్ధి పనుల కోసం మంజూరైన రూ.15 కోట్ల విలువైన టెండర్ పనులను రద్దు చేయడం సరికాదని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కౌన్సిలర్లు గురువారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కౌన్సిలర్లతోపాటు ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు.
మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ సర్వసభ్య సమావేశానికి హాజరు కాకపోయినప్పటికీ వైస్ చైర్మన్ సమావేశం నిర్వహించి టెండర్లను రద్దు చేయడం సరికాదన్నారు. ముస్లిం మైనార్టీ వార్డులకు ఎక్కువ నిధులు కేటాయించి బీజేపీ కౌన్సిలర్లున్న వార్డుల్లో నిధులు తగ్గించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. టెండర్ల రద్దును ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. సీనియర్ నేత రావుల రామనాథ్, కౌన్సిలర్లు సాధం స్వప్న, విజయ్ కుమార్, రామోజీ నరేశ్, శశాంక్, హేమలత పాల్గొన్నారు.