Reading Time: < 1 minute

అయ్యంగార్లు/అయ్యర్లలో 21 శాతం మందికి బాల్యవివాహాలు

Caption of Image.

ప్రభుత్వం 2024లో  నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ ఉపాధి వంటి ఐదు కీలక రంగాల్లో ఆయా కులాల స్థితిగతులను నిశితంగా విశ్లేషించింది నిపుణుల బృందం. తెలంగాణలో సామాజిక స్థితిగతులను ఈ సర్వే బయటపెట్టింది.

  • మహిళల విద్యలో వెనుకబాటు.. బాల్య వివాహాలు

రాష్ట్రంలో దాదాపు 2.16 లక్షల మంది బాలికలకు 18 ఏళ్లలోపే పెళ్లవుతోంది. విచిత్రంగా అగ్రవర్ణాలైన అయ్యంగార్లు/అయ్యర్లలో ఈ శాతం ఎక్కువగా (21.2%) ఉండటం నిపుణులను ఆశ్చర్యపరిచింది. లింగ నిష్పత్తి ఎస్సీల్లో మెరుగ్గా (101.0%) ఉండగా, అగ్రవర్ణాల్లో (97.6%) తక్కువగా ఉంది. 

మహిళల స్థితిగతులపైనా ఈ నివేదిక కీలక అం శాలను వెల్లడించింది. రాష్ట్రంలో 65.5 % మంది మహిళలు పదో తరగతి కూడా దాటలేదు. ఎస్టీ మహిళల్లో ఈ వెనుకబాటుతనం 72.3 శాతంగా ఉండటం శోచనీయం. బాల్య వివాహాల విషయంలో కూడా ఆందో ళనకర పరిస్థితులు ఉన్నాయి.

  • కులవృత్తులను వదిలేసిన్రు

తెలంగాణలో కుల వృత్తులపై ఆధారపడటం క్రమంగా తగ్గుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. సుమారు 69.6 శాతం మంది తమ సంప్రదాయ కుల వృత్తులను  వదులుకుని ఇతర రంగాల్లోకి మారారు. కేవలం 30.4 శాతం మంది మాత్రమే ఇంకా కుల వృత్తులపైనే ఆధారపడుతున్నారు. కుల వృత్తులను వదులుకున్న వారిలో అగ్రవర్ణాల వారు 85.6 శాతంతో ముందుండగా, బీసీలు 61.3 శాతం మంది ఉన్నారు. 

ఎస్సీల్లో 71.4 శాతం, ఎస్టీల్లో 87 శాతం మంది కుల వృత్తులను వీడి దినసరి కూలీలుగా లేదా ఇతర పనుల్లో స్థిరపడ్డారు. ముఖ్యంగా పట్టణీకరణ వల్ల యువత కుల వృత్తుల పట్ల ఆసక్తి చూపడం లేదు. కుల వృత్తులను ఇంకా కొనసాగిస్తున్న వారిలో బీసీ వర్గాలు 38.7 శాతంతో మెజారిటీగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుల వృత్తుల ప్రభావం దాదాపు 81.5 శాతం మేర తగ్గింది. ఈ ధోరణి సామాజిక గమనశీలతను  ఆర్థిక మార్పులను సూచిస్తోంది. సాంప్రదాయ వృత్తుల నుంచి ఆధునిక వృత్తుల వైపు మళ్లుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది.

©️ VIL Media Pvt Ltd.