
నేడు (గురువారం) కేరళ, అసోం, పుదుచ్చేరిల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. వామపక్ష కూటమి అధికారంలో ఉన్న కేరళలో 2.71 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవల్సి ఉంది. ఇక్కడ ఎల్‌డిఎఫ్ వరుసగా మూడోసారి తన బలాన్ని పరీక్షించుకొంటోంది.కాంగ్రెస్ సారధ్య అ యుడిఎఫ్ రాష్ట్రంలో విరామం తరువాత పాగాకు యత్నిస్తోంది. ఇక బిజెపి సారధ్య ఎన్‌డిఎ తన ఖాతా తెరిచేందుకు రంగంలోకి దిగింది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలలో మొత్తం మీద 883 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ప్రధాన పోటీ అత్యధిక స్థానాలలో యుడిఎఫ్, ఎల్‌డిఎఫ్ మధ్యనే ఉంటుంది. బిజెపి రాకతో రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొంది. పది సంవత్సరాల తమ పాలనలో సాధించిన ప్రగతిని చాటుకుంటూ అధికార ఎల్‌డిఎఫ్ ప్రచారం సాగించింది. ఈ హయాంలో అవినీతిని ఎండగడుతూ ప్రతిపక్ష యుడిఎఫ్ విజయం కోసం ఆరాటపడుతోంది. ఈశాన్య రాష్ట్రం అసోంలో బిజెపి ఈసారి గెలుపుతో హ్యాట్రిక్‌కు సర్వశక్తులు ఒడ్డింది. ఇక్కడ ఎన్‌డిఎ, కాంగ్రెస్ నాయకత్వ ప్రతిపక్ష కూటమి నడుమ పోటి నెలకొని ఉంది.
126 మంది సభ్యుల అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇప్పుడు మొత్తం 722 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ్ గొగోయ్, ప్రతిపక్ష నేత దెవవ్రత సైకియా, ఎఐయుడిఎఫ్ అధ్యక్షులు బద్ద్రుద్దీన్ అజ్మల్, రాయ్‌జోర్ దళ్ నేత అఖిల్ గొగోయ్ , ఎజెపి ప్రెసిడెంట్ లూరింజ్యోతి గగోయ్ రంగంలో ఉన్నారు. ఈసారి ఎన్నికలకు చాలా కాలం ముందుగానే రాష్ట్ర కాంగ్రెస్ నేత గౌరవ్ ప్రధాన కేంద్రంగా బిజెపి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఆయన జాతీయతను ప్రశ్నించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు గురువారమే ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 294 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు, ఇక్కడ ఎన్‌డిఎకు కాంగ్రెస్, అన్నాడిఎంకె, విసికెతో కూడిన ఇండియా కూటమి సవాలు విసురుతోంది. ఈసారి నటుడు విజయ్ కూడా తమ టివికె పార్టీ తరఫున అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఎన్‌డిఎలో కీలకమైన ఎఐఎన్‌ఆర్‌సి నేత , సిఎం రంగస్వామి ఇప్పుడు థట్టన్‌చావడీ, మంగళం స్థానాల నుంచి పోటీలో ఉన్నారు