
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఇందులో ఖరీఫ్ పంటకాలానికి ఎరువులలో సబ్సిడీని 12 శాతం పెంచే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఖరీఫ్‌లో నత్రజని, భాస్వర (పి. కె) ఎరువులపై ప్రభుత్వ సబ్సిడీ పెరుగుదల రూ 41,534 కోట్లుగా నిర్ణయించారు. గల్ఫ్ యుద్ధంతో సరఫరాల ఆటంకాలతో అంతర్జాయ స్థాయి ధరల ప్రభావం ఎరువులపై పడకుండా ఉండేందుకు సబ్సిడీని పెంచారు. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటకాలానికి నత్రజని ఆధారిత ఎరువులపై కిలోకు రూ 47.32 పైసలు చొప్పున పెరుగుతుంది. ఇక ఫాస్పేట్ ఎరువులపై సబ్సిడీలు కిలోకు రూ 52.76 చొప్పున పెరుగుతాయని కేబినెట్ తరువాత కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్వనీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ఇక సల్ఫర్ ఎరువులపై సబ్సిడీలు రూ 3.16గా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ పంటల పోషక ప్రతిపాదిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) స్కీమ్ పరిధిలో ఈ సబ్సిడీల పెంపుదల ఖరారు చేశారు. ఈ పథకం 2010 ఏప్రిల్ నుంచి అమలులో ఉంది. గత ఏడాది 2025 ఖరీఫ్ సీజన్ సబ్సిడీ మొత్తంతో పోలిస్తే ఇప్పుడు ఈ ఏడాది పెంపుదల రూ 4317 కోట్లుగా ఉందని తెలిపారు.ఎన్‌బిఎస్ స్కీమ్ పరిధిలోకి వచ్చే 28 రకాల ఎరువుల సబ్సిడీలకు ఈ పెంపుదల వర్తిస్తుంది. కోవిడ్ దశలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు ప్రత్యేకించి డిఎపి వంటి వాటి దరలు గణనీయంగా పెరిగాయి. అయితే దేశంలో 50 కిలోల ఎరువుల సంచి రిటైల్ ధర రూ 1350గానే ఉంచామని మంత్రి వివరించారు. ఇప్పుడు యుద్ధం దశలోనూ రైతుల ఎరువులపై భారం పడకుండా పలు చర్యలు తీసుకున్నారని తెలిపారు. కేబినెట్‌లో రెండు ప్రధాన మౌలిక సదుపాయాల వ్యవస్థల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో రూ 40000 కోట్ల వ్యయ అంచనాలతో రెండు జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదన అంశం కూడా ఉంది. జైపూర్ మెట్రోరైలు రెండో దశకు కూడా ఆమోదం వెలువడిందని కేబినెట్ తరువాత కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వెస్ట్‌బెంగాల్ జార్ఖండ్ మల్టీ ట్రాకింగ్ రైలు ప్రాజెక్టుకు కూడా గ్రీన్‌సిగ్నల్ వెలువడింది.రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీ రెట్టింపు సామర్థపు నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజస్థాన్ రిఫైనరీ డబ్లింగ్ పనులకు రూ 79,450 కోట్ల వ్యయ అంచనాలకు ఆమోదం తెలిపారు. హెచ్‌పిసిఎల్ నుంచి అదనపు ఈక్విటీ మద్దతు కూడా ఈ ప్రాజెక్టుకు దక్కుతుంది. ఈ మేరకు ఇప్పుడు హెచ్‌సిఎల్ నుంచి ఈ ప్రాజెక్టులో రూ 19600 కోట్ల వరకూ ఈక్విటీ ఉంటుంది. ఈ రిఫైనరీకి ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 21న ప్రారంభోత్సవం జరుపుతారు.