Reading Time: 2 minutes
Kalki 2 Nag Ashwin Plans Two Web Series Before Release Prabhas Film Gets Massive Expansion

Prabhas Kalki 2 Latest Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద విజువల్ వండర్స్‌లో ఒకటిగా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2’ కోసం చిత్రబృందం సన్నాహాలు చేస్తుండగా.. దర్శకుడు నాగ్ అశ్విన్ మరో ఆసక్తికరమైన ప్లాన్‌తో సిద్ధమవుతున్నట్లు సమాచారం.

‘కల్కి 2898 AD’ విడుదల సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ప్రత్యేక యానిమేషన్ సిరీస్‌ను తీసుకొచ్చిన నాగ్ అశ్విన్.. ఇప్పుడు ‘కల్కి 2’ విడుదలకు ముందే మరోసారి డిజిటల్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈసారి సినిమాలోని కీలక పాత్రల నేపథ్యాన్ని వివరించే రెండు ప్రత్యేక వెబ్ సిరీస్‌లను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు వెబ్ సిరీస్‌లలో ఒకటి దుల్కర్ సల్మాన్ పోషించిన పాత్రకు సంబంధించిన బ్యాక్‌స్టోరీపై ఉండనుండగా.. మరో సిరీస్ సుమతి పాత్ర చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.

‘కల్కి పార్ట్ 1’లో సుమతి పాత్రను దీపికా పదుకొణె పోషించగా.. రెండో భాగంలో ఈ పాత్రలో సాయి పల్లవి కనిపించే అవకాశముందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమతి పాత్ర గతం, ఆమెకు కల్కి ప్రపంచంతో ఉన్న అనుబంధాన్ని మరింత లోతుగా చూపించేలా ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌ల కథలు ‘కల్కి పార్ట్ 1’ క్లైమాక్స్‌తో అనుసంధానమై ఉండనున్నాయని సమాచారం. ప్రతి సిరీస్‌ను దాదాపు గంట నిడివితో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ కథల ద్వారా ప్రేక్షకులకు సినిమాలోని పాత్రల భావోద్వేగాలు, వారి గతం, భవిష్యత్తు కథనాలపై మరింత స్పష్టత వచ్చేలా నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే ఈ ప్రత్యేక వెబ్ సిరీస్‌లను ‘కల్కి పార్ట్ 2’ థియేటర్లలోకి రాకముందే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ SonyLIVలో స్ట్రీమింగ్ చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. ‘కల్కి’ విశ్వాన్ని మరింత విస్తరించే ప్రయత్నంగా ఈ వెబ్ సిరీస్‌లు నిలవనున్నాయి. దీంతో ‘కల్కి పార్ట్ 2’పై ఇప్పటికే ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అభిమానులు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.