Reading Time: 2 minutes
Abhishek Sharmas Fifty Erased After Scoring Correction In India Vs Ireland 1st T20i

Abhishek Sharma Fifty Cancelled in India vs Ireland 1st T20I: భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 19 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం అభిషేక్ హాఫ్ సెంచరీ రికార్డు బుక్స్ నుంచి మాయమైంది. మ్యాచ్ సమయంలో 19 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసినట్లు నమోదు కాగా.. చివరకు అధికారికంగా 20 బంతుల్లో 49 పరుగులే చేసినట్లు స్కోర్ సవరించబడింది. మ్యాచ్ అనంతరం చేసిన ఈ స్కోరింగ్ సవరణ ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ అర్ధ శతకం ఎందుకు రద్దయిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

లెగ్‌బైగా మారిన పరుగు:

భారత్ 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో సంచలన ఓటమి చవిచూసిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడాడు. తొలి ఓవర్‌లోనే మూడు బంతుల్లో 10 పరుగులు సాధించిన అభి.. రెండో ఓవర్‌లో జై మూంద్ర బౌలింగ్‌ను టార్గెట్ చేశాడు. ఆ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాదిన అభిషేక్.. చివరి బంతికి ఒక పరుగు తీశాడు. ఫీల్డ్ అంపైర్ దానిని బ్యాట్‌కు తగిలినట్లు భావించి.. పరుగుగా ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత వీడియోలను పరిశీలించిన అధికారులు కీలక సవరణ చేశారు. రెండో ఓవర్ చివరి బంతి అభిషేక్ బ్యాట్‌కు కాకుండా.. తొడ ప్యాడ్‌ను తాకి ఫైన్ లెగ్ వైపు వెళ్లిందని తేల్చారు. దీంతో మొదట బ్యాటర్ ఖాతాలో వేసిన ఒక పరుగును లెగ్‌బైగా మార్చారు.

రికార్డు బుక్స్ నుంచి మాయం:

లెగ్ బై అని తేలడంతో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ నుంచి ఆ పరుగును తొలగించారు. ఫలితంగా అభిషేక్ వ్యక్తిగత స్కోరు 50 నుంచి 49కు తగ్గింది. హాఫ్ సెంచరీ చేసిన మరుసటి బంతికే అభిషేక్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొతానికి అభిషేక్ హాఫ్ సెంచరీ రికార్డు బుక్స్ నుంచి మాయమైంది. అయితే భారత జట్టు మొత్తం స్కోరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే ఆ పరుగు జట్టు ఖాతాలోనే కొనసాగింది. విషయం తెలిసిన అభిషేక్ కాస్త నిరాశ చెందాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారమే సవరణ:

ఈ మార్పు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారమే జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్కోరింగ్‌లో పొరపాటు జరిగినట్లు అంపైర్లు గుర్తిస్తే.. అధికారిక స్కోరును సవరించే అధికారం వారికి ఉంటుంది. మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయని సందర్భాల్లో వ్యక్తిగత గణాంకాలను కూడా సరిదిద్దవచ్చు. అదే నిబంధన ప్రకారం.. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీని రద్దు చేసి అధికారికంగా 49 పరుగులుగా నమోదు చేశారు.

పరాజయం పెద్ద షాక్‌:

అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చినా.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో భారత్ 34 పరుగుల తేడాతో ఐర్లాండ్ చేతిలో అనూహ్య ఓటమి పాలైంది. వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టుకు ఈ పరాజయం పెద్ద షాక్‌గా మారింది. ఈరోజు జరిగే రెండో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. అభిమానుల దృష్టి మరోసారి అభిషేక్ శర్మతో పాటు భారత టాప్ ఆర్డర్ ప్రదర్శనపైనే నిలిచింది.