
The India Story: మనం ప్రతిరోజూ ఎంతో ఇష్టంగా తినే ఆహారంలోనే స్లో పాయిజన్ ఉందా? పంటలు పండించేందుకు వాడుతున్న రసాయనాలు మన పిల్లల భవిష్యత్తును బుగ్గి పాలు చేస్తున్నాయా? ఈ నగ్న సత్యాన్ని కళ్లకు కడుతూ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హార్డ్ హిట్టింగ్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
రసాయనాలు, పురుగుమందుల ఆధారిత వ్యవసాయం (పెస్టిసైడ్ ఫార్మింగ్) వల్ల నేటి సమాజం ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రోజూ కోట్లాది మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన సమస్యను టీజర్‌లో చూపించిన విధానం ఆలోచింపజేసేలా ఉంది. వ్యవస్థలోని లోపాలను, పురుగుమందుల మాఫియా వెనుక దాగి ఉన్న భయంకరమైన కోణాలను వెలికితీసేందుకు కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే చేసే పోరాటం టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. మన ప్లేట్‌లోకి వచ్చే ఆహారంలో రసాయన విషం ఎలా చేరుతోంది, అది ముఖ్యంగా యువత ఆరోగ్యాన్ని ఎలా గుల్ల చేస్తోందనే చేదు నిజాన్ని ఈ చిత్రంలో ఎమోషనల్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆవిష్కరించారు.
ఈ సినిమా గురించి స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ఇది కమర్షియల్ సినిమా కాదు, సమాజానికి చాలా అవసరమైన ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమా. ఒక తల్లిగా ఈ కథ వినగానే నేను వ్యక్తిగతంగా చాలా కనెక్ట్ అయ్యాను. నేటి కాలంలో పిల్లల ఆరోగ్యం గురించి ప్రతి తల్లిదండ్రుల్లో ఉండే భయాలు, ఆందోళనలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. మనం తింటున్న ఆహారం, అది మన భవిష్యత్ తరాలపై చూపే ఇంపాక్ట్ గురించి ఈ మూవీ కచ్చితంగా కళ్ళు తెరిపిస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
హీరో శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ.. “ప్రతి ఇంటినీ ప్రభావితం చేసే కరెంట్ టాపిక్ ఇది. దీనివల్ల వచ్చే దీర్ఘకాలిక రోగాల గురించి మనం పెద్దగా పట్టించుకోం. ఈ సినిమాలో వ్యవస్థతో, ఒక మాఫియాతో పోరాడే సగటు తండ్రి పాత్రలో నా నటన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, సమాజంలో ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది” అని అన్నారు.