Reading Time: < 1 minute
Ravi Kishan Emotional Saree Comment Daughter Riva Prime Video Alliance Show

Ravi Kishan: అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా సరికొత్తగా ప్రారంభమైన రియాలిటీ షో ‘అలయన్స్’ (Alliance). ఈ షో లో మొదటి వారంలోనే అత్యంత భావోద్వేగ భరితమైన దృశ్యం ఒకటి చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, గోరఖ్‌పూర్ ఎంపీ రవి కిషన్ తన కుమార్తె రీవా కిషన్‌తో కలిసి ఈ క్రేజీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తండ్రీకూతుళ్ల మధ్య సాగిన ఒక ఎమోషనల్ అండ్ ఫన్నీ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలో భాగంగా పాల్గొన్న తన కుమార్తె రీవా కిషన్ కళ్లల్లో నీళ్లు తిరగడం చూసి రవి కిషన్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఏమైందని అడగ్గా.. “నువ్వు నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చావు పాపా.. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావు?” అంటూ రీవా కాస్త ఎమోషనల్ అయింది. ఆ వెంటనే తన కన్నీళ్లను దాచుకుంటూ.. “బహుశా మొదటి రోజు కావడం వల్ల ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా ఏడ్చేసి ఉంటాను” అని సర్దిచెప్పుకుంది. కుమార్తె మాటలకు రవి కిషన్ అమాయకంగా స్పందిస్తూ.. “అయితే ఇక్కడ నేనున్నానుగా.. నేనేంటి మరి?” అని ప్రశ్నించడంతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు విరిశాయి. ఆ తర్వాత రవి కిషన్ అక్కడ ఉన్న తోటి కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. రీవా ఎప్పుడూ వాళ్ల అమ్మతోనే ఎక్కువ సమయం గడుపుతుందని, అందుకే ఆమెను మిస్ అవుతుందని చెప్పారు. ఆపై అక్కడి వాతావరణాన్ని తేలికపర్చడానికి ఆయన చేసిన వ్యాఖ్యలు హైలైట్‌గా నిలిచాయి. “ఇప్పుడు నేను సడన్‌గా అమ్మగా ఎలా మారిపోవాలి? ఎవరి దగ్గరైనా విగ్ ఉందా? ఉంటే చెప్పండి.. మీసం తీసేసి, చీర కట్టేసుకుంటాను” అంటూ రవి కిషన్ జోక్ చేశారు. ఆయన టైమింగ్‌కు రీవా తన కన్నీళ్లు తూడ్చుకుని గట్టిగా నవ్వేసింది. యాక్టర్-డైరెక్టర్ కునాల్ ఖేము హోస్ట్ చేస్తున్న ఈ ‘అలయన్స్’ షో సరికొత్త స్ట్రాటజీ, టాస్కులతో ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ చిత్రం ‘సబ్ కుశాల్ మంగళ్’ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రీవా కిషన్, తన తండ్రితో కలిసి ఈ షోలో పాల్గొనడం.. వారి మధ్య ఉన్న బాండింగ్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.