Reading Time: 2 minutes
Maharashtra Telangana Border Villages Sir Survey Protest

SIR Survey : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ (SIR – ఎన్యూమరేషన్) ప్రక్రియకు మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో గట్టి బ్రేక్ పడింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం , మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా రాజూరా తాలూకా సరిహద్దుల్లో ఉన్న 14 వివాదాస్పద గ్రామాల ప్రజలు ఈ ప్రక్రియను అడ్డుకున్నారు. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల ఓటర్లుగా కొనసాగుతూ, ఎన్నికలొచ్చినప్పుడల్లా ఇరువైపులా ఓట్లు వేసిన పరంధోళి, ముకందగూడ, భోలాపటార్, అంతాపూర్ పంచాయతీల పరిధిలోని ప్రజలు ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. దేశంలో రెండు ఓట్లు కలిగి ఉంటే చట్టప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో.. “అసలు మాది ఏ రాష్ట్రమో అధికారికంగా తేల్చాకే మా వద్దకు ఎన్యూమరేషన్ కోసం రండి” అంటూ బి.ఎల్.ఓ.లు, సూపర్వైజర్లకు వారు స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సరిహద్దు వివాదానికి శాశ్వత చెక్ పెట్టాలని, అప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారాలను స్వీకరించేది లేదని పరంధోళి, కోటా, లేండిగూడ, శంకర్లొద్ది, మహరాజ్గూడ తదితర గ్రామాల ఓటర్లు తేల్చిచెప్పారు.

డబుల్ పన్నులు.. రిజర్వ్ ఫారెస్ట్ భూసమస్యల వ్యథ

ఈ సరిహద్దు గ్రామాల్లో 75 శాతం ఉన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు తమ భూసమస్యలను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. గతంలో 2014 వరకు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ప్రశాంతంగా వ్యవసాయం చేసుకున్నామని, ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం కూడా తమ భూములకు పహాణీలు (పట్టాలు) ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి, ఈ భూములన్నీ రిజర్వు ఫారెస్టు పరిధిలోకి వస్తాయని, ఇక్కడ మొక్కలు నాటుతామంటూ తమ సాగు పనులను అడ్డుకుంటున్నారని స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇన్నాళ్లుగా రెండు రాష్ట్రాలకు పన్నులు కడుతూ, రెండు రాష్ట్రాల కరెంట్ బిల్లులు చెల్లిస్తూ, డబుల్ దోపిడీకి గురవుతున్న తాము ఒకే ఓటర్ కార్డ్ విధానానికి సిద్ధమేనని.. కానీ, ఆ ఒక్క ఓటర్ కార్డ్ ఇచ్చే రాష్ట్రం తమ భూములకు, జీవనానికి పూర్తి వసతులు కల్పిస్తామని ఖచ్చితమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల రాక కోరుతున్న స్థానికులు.. సమస్యల పరిష్కారమే లక్ష్యం

ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తమ గ్రామాలు గుర్తుకొచ్చే నాయకులకు, ఇప్పటికైనా ఇక్కడి సమస్యలు కనిపించాయా అంటూ సరిహద్దు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా అంతులేని వ్యథను అనుభవిస్తున్న తమకు ఇప్పటికైనా ఏదో ఒక సొంత రాష్ట్రాన్ని కట్టబెట్టి ఈ నరకం నుండి విముక్తి ప్రసాదించాలని కోరుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకాలంటే కేవలం కింది స్థాయి సిబ్బంది వస్తే సరిపోదని, రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో పాటు తెలంగాణ కొమురంభీం ఆసిఫాబాద్, మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లు స్వయంగా ఇక్కడికి రావాలని స్థానికులు పట్టుబడుతున్నారు. ఇరు రాష్ట్రాల అధికారులు ఉమ్మడిగా ఇక్కడి భూసమస్యలను పరిశీలించి, సరిహద్దు వివాదానికి పూర్తి ముగింపు పలికేంత వరకు తాము ఎన్యూమరేషన్ ప్రక్రియకు ఎలాంటి సహకారం అందించబోమని ఈ 14 సరిహద్దు గ్రామాల ప్రజలు తెగేసి చెప్పారు.