
పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలల పాటు ఇరాన్-అమెరికా మధ్య సాగిన యుద్ధం ముగిసింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచదేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. చమురు కొరతతో పలు దేశాలు అల్లాడిపోయాయి. యుద్ధం మొదలైన నాలుగు నెలల తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందంతో కుదరడంతో ఎట్టకేలకు వార్‌కు ఎండ్ కార్డ్ పడింది. దీంతో ప్రపంచదేశాలు ఊపిరిపీల్చుకుంటున్నాయి. పరిస్థితి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ఇదిలా ఉండగానే.. మరో యుద్ధం మొదలు కానుందనే వార్తలు ప్రపంచదేశాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తాజాగా, దక్షిణ కొరియా గగనతలంలో చైనా, రష్యా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శనివారం (జూన్ 27) పదికి పైగా చైనా, రష్యా సైనిక విమానాలు దక్షిణ కొరియా గగనతలంలో ప్రవేశించాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియో ధృవీకరించింది. తూర్పు సముద్రం, దక్షిణ సముద్రం మీదుగా ఉన్న కొరియా వైమానిక రక్షణ గుర్తింపు జోన్ (KADIZ)లోకి చైనా, రష్యా విమానాలు ప్రవేశించి, ఆపై నిష్క్రమించాయని తెలిపింది. దక్షిణ కొరియా సైన్యం వాటిని గుర్తించి.. ఎలాంటి ఆకస్మిక పరిస్థితికైనా సిద్ధంగా ఉండేందుకు వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించిందని పేర్కొంది.
దక్షిణ కొరియా వాయు రక్షణ గుర్తింపు ప్రాంతం (ADIZ) అనేది ఆ దేశ సార్వభౌమ గగనతలం కానప్పటికీ.. జాతీయ భద్రత దృష్ట్యా ఆ ప్రాంతంలోకి వచ్చే విమానాలను గుర్తించడానికి ఏర్పాటు చేసుకునే ఒక బఫర్ జోన్. సైనిక విమానాలు ఒక దేశ వాయు రక్షణ మండలంలోకి ప్రవేశించే ముందు ఆ దేశానికి తెలియజేయవలసి ఉంటుంది. అయితే, చట్టపరంగా అటువంటి నోటిఫికేషన్ తప్పనిసరి కాదు. ఇందులో భాగంగానే వాయు రక్షణ గుర్తింపు మండలంలోకి ప్రవేశించే ముందు చైనా, రష్యా దక్షిణ కొరియాకు సమాచారం ఇవ్వలేదు.
చైనా, రష్యా వైమానిక దళాలు జపాన్ సముద్రం, తూర్పు చైనా సముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంపై వ్యూహాత్మక గగనతల గస్తీ నిర్వహించిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చైనా స్పష్టం చేసింది. ఈ ఘటనపై ఇప్పటి వరకు రష్యా స్పందించలేదు. మరోవైపు.. చైనా, రష్యా యుద్ధ విమానాల కదలికల నేపథ్యంలో దక్షిణ కొరియా అప్రమత్తమైంది. ఆ దేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ను అలర్ట్ చేసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొంది.